Begin typing your search above and press return to search.

లాక్ డౌన్:3 వేల మంది విదేశీయులకు గ్రీన్ సిగ్నల్..22 విమానాల్లో జంప్!

By:  Tupaki Desk   |   30 April 2020 3:30 PM GMT
లాక్ డౌన్:3 వేల మంది విదేశీయులకు గ్రీన్ సిగ్నల్..22 విమానాల్లో జంప్!
X
కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో రవాణా పూర్తిగా ఆగిపోయింది. దేశ - అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కడి వారు అక్కడే లాక్ అయ్యారు. తాజాగా బెంగళూరుతో పాటు దక్షిణ భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లో లాక్ డౌన్ సందర్బంగా చిక్కుపోయిన సుమారు 3 వేల మందికి పైగా విదేశీయులను వారివారి దేశాలకు పంపించారు. మొత్తం 22 విమానాల్లో 17 దేశాలకు చెందిన విదేశీయులు బెంగళూరు నుంచి విమానాల్లో వారి వారి సొంత దేశాలకి ప్రయాణమై వెళ్లారు.

కరోనా ను కట్టడి చేయడానికి మొదటగా ఏప్రిల్ 14 వరకు ..ఆ తరువాత మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగించడంతో విదేశాల నుంచి భారత్ వచ్చిన విదేశీకులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. స్వదేశాలతో వెళ్లలేక ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోయారు. అయితే , లాక్ డౌన్ విధించినప్పటి నుండి విదేశీయులు తమ దేశానికీ తమని పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే కరోనా వైరస్ భారత్ లో రోజురోజుకు వ్యాపిస్తున్న సమయంలో విదేశీయుల విషయంపై కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఆచితూచి అడుగులు వేసింది. తాజాగా విదేశీయులని తరలించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విదేశీయులందరికి కరోనా నిర్దారణ పరీక్షలు చేసి ,బెంగళూరు నగరంతో పాటు దక్షిణ భారతదేశంలో లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన విదేశీయులను వారి స్వదేశాలకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జపాన్ - శ్రీలంక - దోహా - బాగ్దాద్ - మస్కట్ - ప్యారిస్ - రియాద్ - రోమ్ - లండన్ తో పాటు మొత్తం 17 దేశాలకు చెందిన విదేశీయులను 22 విమానాల్లో వారి దేశాలకు పంపించాలని నిర్ణయించారు. బెంగళూరు నగరం శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 22 విమానాల్లో విదేశీయులు వారి స్వదేశాలకు బయలుదేరి వెళ్లారు. విమానాలు పూర్తిగా శానిటైజేషన్ చేసి కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరు నుంచి జపాన్ కు ఎక్కువ విమానాలు బయలుదేరి వెళ్లాయి.