Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి వచ్చిన వారిని వెలివేస్తున్న గ్రామస్థులు

By:  Tupaki Desk   |   23 March 2020 5:34 AM GMT
విదేశాల నుంచి వచ్చిన వారిని వెలివేస్తున్న గ్రామస్థులు
X
కరోనా భయం అంతటా ఆవరించింది. అంటువ్యాధి అయిన మహమ్మారి గురించి భయపడుతున్న గ్రామస్థులు.. విదేశాల నుంచి.. దూర ప్రయాణాలు చేసిన వారిని గ్రామంలోకి రాకుండా నిర్బంధిస్తున్నారు. వెలివేస్తున్నారు.. కొన్ని చోట్ల వారిపై దాడులు చేస్తున్న సంఘటనలు కూడా వెలుగుచూస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గ్రామాల్లోకి ప్రజలు అనుమతించని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేటకు వచ్చిన ఇద్దరినీ గ్రామస్థులు తరిమికొట్టారు. దుబాయ్ నుంచి స్వగ్రామం వచ్చిన వ్యక్తిని.. అలాగే కర్ణాటక నుంచి గ్రామంలోకి వచ్చిన మరో వ్యక్తిని గ్రామంలో అడుగు పెట్టనీయలేదు.

దుబాయ్ లో వలస కార్మికుడిగా పనిచేసే రాములు ఇటీవలే కరోనాతో పనులు ఆగిపోవడం స్వగ్రామం లింగపేటకు వచ్చాడు. అతడిని ఊరిబయటే అడ్డుకున్న గ్రామస్థులు గ్రామంలోకి వస్తే దాడి చేస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని కరోనా లేకుంటేనే గ్రామంలోకి రావాలని.. క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు.

ఇక మరో వ్యక్తి కర్ణాటక నుంచి వచ్చిన అనిల్ కుమార్ కూడా నాలుగు రోజుల కర్ణాటక పర్యటన ముగించుకొని లింగం పేటకు రాగా.. కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్నాకే రావాలని గ్రామస్థులు వెళ్లగొట్టారు.

ఇక రాజన్న సిరిసిల్లకు ఈనెల 18న దుబాయ్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అధికారులు క్వారంటైన్ లో ఉంచినా ఉల్లంఘించి సిరిసిల్లకు ఫ్రిజ్ కొనడానికి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అర్ధరాత్రి అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఇలా కరోనాను మోసుకొని వచ్చే విదేశీయులను, పర్యాటకులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్న విపరిణామం కలకలం రేపుతోంది. కరోనా భయంతో గ్రామస్థులంతా వలసవాదులను వెలివేస్తున్న వైనం వెలుగుచూస్తోంది.