Begin typing your search above and press return to search.

ఏపీకి విదేశీ బొగ్గు ?

By:  Tupaki Desk   |   17 Oct 2021 5:05 AM GMT
ఏపీకి విదేశీ బొగ్గు ?
X
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో బొగ్గు కొరతను ఎదుర్కోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విదేశాల నుండి బొగ్గును కొనే అంశాన్ని పరిశీలిస్తోంది. మనకు మామూలుగా దేశీయంగా ఉండే సింగరేణి, మహానది కోల్ ఫీల్డ్స్ లాంటి బొగ్గుగనుల నుండే బొగ్గు సరఫరా అవుతోంది. కొంతవరకు విదేశాల నుండి సరఫరా అయ్యే బొగ్గును కూడా ఉపయోగించుకుంటున్నది ప్రభుత్వం. విదేశాల నుండి ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుండే మన దేశానికి బొగ్గు అందుతోంది.

కరోనా వైరస్ సమస్యలు తదితరాలతో స్వదేశీ, విదేశీ గనుల నుండి బొగ్గు సరఫరా తగ్గిపోయింది. అలాగే భారీ వర్షాల కారణంగా కూడా బొగ్గు తవ్వకాలకు తీవ్ర అంతరాయం వచ్చింది. ఇలాంటి పరిస్ధితుల్లోనే బొగ్గు నిల్వలపై ప్రభావం పడింది. దేశంలో థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు 135 ఉండగా ఇందులో దాదాపు 100 కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అయిపోతుండటంతో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ఏపితో పాటు మరో 15 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్తత్తి తగ్గిపోయింది.

మామూలుగా అయితే మూడు నెలలకు ముందే రాష్ట్రాలు తమ బొగ్గు అవసరాలకు ఇండెంట్ పెట్టాలి. అలాగే నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను ఉంచుకోవాలి. కానీ ఇపుడు ఏపీతో పాటు 15 రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు కేవలం రెండు మూడు రోజులకు మించిలేవు. దీంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించేసి హైడ్రో విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు హైడ్రో ఉత్పత్తి సాధ్యంకాదు, సరిపోదు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది. అందుకనే బొగ్గు కొనటానికే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందు బొగ్గు కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే అధిక ధరలు చెల్లించకతప్పదు. ఇండోనేషియా నుండి మనకు సరఫరా అయ్యే టన్ను బొగ్గును ఆ దేశం 60 డాలర్ల నుండి ఒక్కసారిగా 160 డాలర్లకు పెంచేసింది. అలాగే ఆస్ట్రేలియా బొగ్గు టన్ను 45 డాలర్ల నుండి 150 డాలర్లకు పెరిగిపోయింది. దీంతో అవసరమైన బొగ్గు దేశీయంగా సరఫరా కాకపోతే విదేశాల నుండి కొనకతప్పదు. ఇదే పరిస్ధితుల్లో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా విదేశాల నుండి అదిక ధరలు చెల్లించైనా బొగ్గును కొనుగోలు చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోమంటే జనాలు పట్టించుకోరు. ఉత్పత్తి పెంచాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యంకాదు. బొగ్గును సరిపడా చేయాలని అడిగితే దేశీయ బొగ్గు గనుల నుండి కష్టంగా ఉంది. అందుకనే ముందుగా కేంద్రానికి చెల్లించాల్సిన రు. 250 కోట్ల బకాయిలను రాష్ట్రప్రభుత్వం చెల్లించేసింది. లేకపోతే దేశీయ బొగ్గుగనుల నుండి బొగ్గు సరఫరా కాదు. ఒకవేళ మన అవసరాలకు సరిపడా బొగ్గు దేశీయ గనుల నుండి సరఫరా కాకపోతే విదేశాల నుండి బొగ్గు కొనక వేరే దారిలేదు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.