Begin typing your search above and press return to search.

స్వాతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ మహిళకు ఉరి..క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి 12 ఏళ్ల కొడుకు!

By:  Tupaki Desk   |   20 Feb 2021 6:00 PM IST
స్వాతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ మహిళకు ఉరి..క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి 12 ఏళ్ల కొడుకు!
X
ఎంత కరుడుగట్టిన నేరస్థుడికైనా శిక్ష నుండి విముక్తి కల్గించే అవకాశం దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతి కి ఉంటుంది. ఈ క్రమంలోనే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ షబ్నమ్ 12 ఏళ్ల కుమారుడు రాష్ట్రపతికి తన తల్లి గురించి లేఖ రాశాడు. ఆ లేఖలో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు క్షమాభిక్ష పెట్టండి రాష్ట్రపతి అంకుల్‌ ఆమెను ఉరి తీయొద్దు.. అంటూ విజ్నప్తి చేశాడు.

వివరాల్లోకి వెళ్తే .. ఉత్తరప్రదేశ్ లో షబ్నం అనే మహిళ ప్రియుడితో కలిసి ఏడుగురు కుటుంబ సభ్యులను అత్యంత హేయమైన రీతిలో గొడ్డలితో నరికి చంపడం 2008లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో షబ్నంకు ఇటీవలే ఉరిశిక్ష ఖరారైంది. షబ్నం దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను ఇటీవలే యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తోసిపుచ్చారు. మరోసారి ఆ పిటిషన్ గవర్నర్ ముందుకు రాగా, నిర్ణయం కోసం మధుర జైలు వర్గాలు వేచిచూస్తున్నాయి. మరోసారి గవర్నర్ తిరస్కరిస్తే కనుక షబ్నంను ఉరి తీయనున్నారు.ఈ నేపథ్యంలో, షబ్నం కుమారుడు మహ్మద్ తాజ్ రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు.

తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని వేడుకున్నాడు. రాంపూర్ జైలులో తల్లిని కలిసినప్పటి భావోద్వేగాలను తన పిటిషన్ లో పొందుపరిచాడు. షబ్నం కుమారుడు మహ్మద్ తాజ్ జైలులోనే జన్మించాడు. ఈ హత్యలు జరిగిన సమయంలో తాజ్ తల్లి గర్భంలో ఉన్నాడు. తాజ్ ను షబ్నం జైలులోనే ప్రసవించగా, ఆరేళ్ల వయసు వచ్చిన తర్వాత నిబంధనల కారణంగా తాజ్ ను జైలు నుంచి పంపించేశారు. తాజ్ అప్పటినుంచి షబ్నం స్నేహితుడు ఉస్మాన్ సైఫీ సంరక్షణలో ఉంటున్నాడు.

భారత్‌ లో మహిళలను ఉరి తీయడానికి ఏర్పాట్లు ఉన్న ఏకైక ప్రదేశం ‘మథుర జైలు’. దీన్ని 150 ఏళ్ల కిందట నిర్మించారు. బ్రిటిషర్ల పాలనా కాలంలో 1870లో ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం అక్కడ ఓ మహిళకు ఉరిశిక్షను కూడా అమలు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 150 ఏళ్ల నాటి ఈ జైల్లో ఇప్పుడు మరో మహిళను ఉరికంభం ఎక్కించడానికి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్రం తర్వాత ఉరిశిక్షకు గురైన తొలి మహిళగా షబ్నమ్ వార్తల్లోకి ఎక్కనుంది. ఈ నేపథ్యంలో ఆమె కొడుకు క్షమాభిక్ష పెట్టాలని కోరడంతో దీనిపై రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చే స్పందన ను బట్టి చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమౌతున్నారు.