Begin typing your search above and press return to search.

ఎప్పుడూ చేసే పని.. ఈసారికి చేయని పెద్దాయన

By:  Tupaki Desk   |   20 April 2021 8:33 AM IST
ఎప్పుడూ చేసే పని..  ఈసారికి చేయని పెద్దాయన
X
సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో పాటు.. దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. సమాజ్ వాదీ పార్టీని స్థాపించిన పెద్ద మనిషి ములాయం సింగ్ యాదవ్. ఏ మాత్రం అవకాశం లభించినా.. దేశ రాజకీయాల్ని తిప్పిన సత్తా ఆయన సొంతం. 81 ఏళ్ల వయసులో ఈ మధ్యన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వయసు మీద పడిన ఛాయలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

ఈ కారణంతోనే ఆయన్ను వీలైనంతవరకు బయటకు తీసుకురాని పరిస్థితి. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన పరిస్థితి కరోనా కారణంగా ఆయనకు ఎదురైంది. ములాయం జీవితంలో ఎప్పుడూ కూడా ఎన్నికల్లో ఓటు వేయని సందర్భమే లేదు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అవి ఏవైనా సరే.. ములాయం మాత్రం పోలింగ్ రోజున తప్పనిసరిగా హాజరై ఓటు వేసేవారు.

అలాంటి ఆయన తాజాగా యూపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఢిల్లీలోని తన నివాసంలో ఉన్న ఆయన్ను.. ఓటు వేసేందుకు రాష్ట్రానికి రావొద్దని.. కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో బయటకు రావటం ఏ మాత్రం సేఫ్ కాదని చెప్పటమే కాదు.. ఆయన్ను ఒప్పించారు. దీంతో.. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ములాయం తొలిసారి ఓటు వేయని పరిస్థితి. పాడు కరోనా.. ఎంత పని చేసింది?