Begin typing your search above and press return to search.

సగటు జీవి బతుకు: పెరిగే జీతం పిసరంత.. ఖర్చుల మోత పిడికెడంత

By:  Tupaki Desk   |   1 April 2022 11:04 AM IST
సగటు జీవి బతుకు: పెరిగే జీతం పిసరంత.. ఖర్చుల మోత పిడికెడంత
X
బతుకు బండి లాగటం భారంగా మారుతోంది. ఒకటో.. రెండో కాకుండా ప్రతిది ఖరీదుగా మారిపోవటం.. ఖర్చులు పెరిగిపోవటం.. దానికి తగ్గట్లు ఆదాయం పెరగకపోవటం.. వెరసి సగటుజీవి బతుకు ఇబ్బందికరంగా మారుతోంది.

కొత్త సంవత్సరం మొదలై ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్నా.. ఆర్థిక లెక్కల ప్రకారం చూస్తే.. ఈ రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావటం తెలిసిందే. క్యాలెండర్ లో కొత్త సంవత్సరం జనవరి 1తో మొదలైతే.. కొత్త ఆర్థిక సంవత్సరం మాత్రం ఏప్రిల్ 1 నుంచి షురూ కావటం తెలిసిందే.

ఈ రోజు నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏటు చూసినా ధరాఘాతమే తప్పించి మరింకేమీ కనిపించదు. ప్రపంచంలో ఏమూలన ఏం జరిగినా సరే.. మూడేది మాత్రం మనకే అన్నట్లుగా పరిస్థితి మారింది.

కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే రోజునే కొత్త బాదుడుకు రంగం సిద్దం చేసిన వైనం చూసిన తర్వాత అనిపించేది ఒక్కటే.. రానున్న రోజుల్లో ఖర్చు మరింత పెరగటం ఖాయమని. అదే సమయంలో అందుకు తగ్గట్లు ఆదాయం పెరగకపోవటం ఇబ్బందిగా మారుతోంది.

ఈ రోజు నుంచి ఆదాయంతో సంబంధం లేకుండా పెరగనున్న ఖర్చుల విషయానికి వస్తే..
- కరెంటు ఛార్జీలు
- టోల్ ఛార్జీలు
- జనరిక్ మందుల ధరలు
- పెట్రోల్.. డీజిల్
- గ్యాస్
- వాహన చట్టం ప్రకారం పన్నుల మోత
- ఆర్టీసీ ఛార్జీలు (అధికారికంగా ఖరారు కాలేదు. అయిపోతుందని చెబుతున్నారు)

ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలానే ఉన్న పరస్థితి. ఇవి కాకుండా రోజువారీ జివితాన్నే తీసుకుంటే నిత్యవసర వస్తువులు.. కూరగాయలు.. పండ్ల ధరలతో పాటు తినుబండారాల ధరలు పెరిగిపోయాయి. వీటితో పాటు స్కూల్ పీజులు.. ఆటో చార్జీలు.. క్యాబ్ ధరలు.. స్కూల్ బస్సు ఛార్జీలు.. అవి ఇవి అన్న తేడా లేకుండా పెరిగిపోతున్నాయి. వీటితో పాటు.. ఇంటి అద్దెల మోత మోగుతోంది.

ఇదంతా చూసినప్పుడు సగటు జీవి ఆదాయం పెరిగిపోతున్న ధరలకు తగ్గట్లు పెరగని పరిస్థితి. దీంతో.. పొదుపు తగ్గి.. ఖర్చు పెరిగి తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇక.. బడ్జెట్ పద్మనాభాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చేతిలో ఉన్న పైసల్ని ఎన్నిసార్లు లెక్క వేసినా పెరగవు. కానీ.. పెట్టాల్సిన ఖర్చులు మాత్రం అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ కలిపి కొత్త ఆర్థిక సంవత్సరంలో సరికొత్త కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న పరిస్థితి.