Begin typing your search above and press return to search.

వైర‌ల్ వీడియోః చికెన్‌ ముక్క కోసం.. రూ.కోట్ల కారు నాశ‌నం!

By:  Tupaki Desk   |   13 Jun 2021 5:00 AM IST
వైర‌ల్ వీడియోః  చికెన్‌ ముక్క కోసం.. రూ.కోట్ల కారు నాశ‌నం!
X
గ్రిల్ చికెన్ ఐడియా ఉందా? అదే.. ఇనుప చువ్వ‌కు మాంసం ముక్క‌ను గుచ్చి మంట మీద వేడిచేస్తారు. దాన్ని తినాల‌నుకున్నారు ఫ్రెండ్స్‌. అందులో త‌ప్పులేదు. దాన్ని వండి తినాల‌నుకున్నారు. అది కూడా మంచిదే. కానీ.. వండాల‌నుకున్న ప‌ద్ధ‌తే వేరుగా ఉంది. ఈ ప్ర‌పంచంలో బుర్ర త‌క్కువ ప్ర‌యోగాలు చేసేవారికి కొద‌వ లేదుక‌దా? ఆ సంఘంలో స‌భ్యులైన వీళ్లు.. కారు పొగ గొట్టంలో మంట‌లు పుట్టించి, ఆ మంట‌ల్లో మాంస‌పు ముక్క‌ను కాల్చాల‌ని డిసైడ్ అయ్యారు. వెంట‌నే ప్రాజెక్టు మొద‌లు పెట్టారు.

అది అలాంటిలాంటి కారు కాదు. లాంబోర్గినీ ఎగ్జాస్ట్‌. దీని విలువ కోట్లాది రూపాయ‌లు. ఆ కారు ఇంజిన్ ను హై రేంజ్ లో ర‌న్ చేస్తే.. పొగ గొట్టం నుంచి మంట‌లు వ‌స్తాయి. ఈ మంట‌ల మీద‌నే చికెన్ ముక్క వండుకు తిన‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఓ వ్య‌క్తి స్క్రూవ‌ర్ కు మాంస‌పు ముక్క‌ను గుచ్చి, సైలెన్స‌ర్ గొట్టం వ‌ద్ద ఉంచ‌గా.. మ‌రొక‌రు కారులోకి ఎక్కి V12 ఇంజిన్ ను ఫుల్లుగా రైజ్ చేశాడు.

దీంతో.. చెవులు చిల్లులు ప‌డే శ‌బ్దంతోపాటు మంట‌లు కూడా వ‌చ్చాయి. వెన‌కాల ఉన్న వ్య‌క్తి చికెన్ కాల్చుకునే బిజీలో ఉన్నాడు. అయితే.. కాసేప‌టికే ఇంజిన్ బ‌ర‌స్ట్ అయ్యింది. భారీగా పొగ‌లు వ‌చ్చి, కారులోని కూలంట్ ద్ర‌వం లీకైపోయింది.

కారు ఇంజిన్ ను భారీగా వేడెక్కించ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని స‌మాచారం. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. ఒక్క చికెన్ ముక్క కోసం కోట్లాది రూపాయ‌ల విలువైన కారును నాశ‌నం చేసుకున్నారంటూ గ‌ట్టిగానే వేసుకుంటున్నారు. ఇంత‌కీ.. ఇదంతా ఎక్క‌డ జ‌రిగింద‌నేగా మీ డౌట్‌. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లోని ఓ కారు గ్యారేజీలో జ‌రిగింది. కొంద‌రు పోర‌గాళ్లు ఈ ప‌నిచేశారు. ఇంత‌కీ.. ఆ కారు వీళ్ల‌దో..? ఎవ‌రిదైనా క‌స్ట‌మ‌ర్ దో..??