Begin typing your search above and press return to search.

ల‌క్ష‌ల ఫుడ్ ప్యాకెట్స్ ఎలా చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   20 Oct 2015 2:25 PM GMT
ల‌క్ష‌ల ఫుడ్ ప్యాకెట్స్ ఎలా చేస్తున్నారు?
X
పులిహోర‌.. ద‌ద్దోజ‌నం.. చ‌క్ర‌పొంగ‌లి.. తాపేశ్వ‌రం కాజా. ఇవి కాకుండా మంచినీళ్ల ప్యాకెట్‌ బాటిల్‌. అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రికి అందే ఫుడ్ ప్యాకెట్‌. ఇక‌.. భూములు ఇచ్చే రైతుల‌కు వీటితో పాటు మ‌జ్జిగ ప్యాకెట్‌.. మంచినీళ్ల ప్యాకెట్ బ‌దులుగా వాట‌ర్ బాటిల్‌. మ‌జ్జిగ‌.. నీళ్ల ప్యాకెట్ల‌ను ప‌క్క‌న పెడితే.. ఫుడ్ ప్యాకెట్స్ కు సంబంధించి పెద్ద స‌వాలే.

ఎందుకంటే.. ద‌ద్దోజ‌నం.. పులిహోర‌.. చ‌క్ర‌పొంగ‌లి ఏ మాత్రం ఆల‌స్య‌మైనా వాస‌న రావ‌టం ఖాయం. తాజాద‌నం ఏ మాత్రం తేడా వ‌చ్చినా జ‌రిగే ర‌చ్చ ఎక్కువే. అలా అని ఇలాంటివి త‌యారు చేయాల్సిన ప్యాకెట్లు వెయ్యో.. ప‌ది వేలో కాదు.. ఏకంగా 1.60ల‌క్ష‌ల ప్యాకెట్లు త‌యారు చేయాలి. మ‌రింత భారీగా త‌యారు చేయాలంటే ఎప్పుడు చేస్తారు? స‌మ‌యానికి ఎలా అందిస్తార‌న్న‌ది పెద్ద స‌వాలే.

దీనికోసం భారీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. కొద్ది నెల‌ల క్రితం మ‌హానాడులో రెండు ల‌క్ష‌ల మంది అవ‌లీల‌గా వండి వార్చిన అంబికా క్యాట‌రర్స్ వారికే తాజాగా అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్స్ త‌యారు చేసే బాధ్య‌త కూడా అప్ప‌జెప్పారు.

శంకుస్థాప‌న రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నాటికే ప్యాకెట్ల పంపిణి మొద‌ల‌వుతుంది. అవి మ‌ధ్యాహ్నం నాలుగు గంట‌ల వ‌ర‌కూ తాజాగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. ఇంత భారీ వంట‌కం కోసం ఏకంగా 400 మంది ప‌నివారు.. 200 మంది ప్యాకింగ్ చేసే వాళ్ల‌ను సిద్ధం చేశారు. ఇక‌.. వంట‌ను 21 రోజు అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత నుంచి స్టార్ట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. మొద‌ట అనుకున్న‌ట్లుగా గారె.. పూర్ణం అయితే స‌మ‌యానికి అందించ‌లేమ‌న్న కార‌ణంతోనే మెనూ మారిన‌ట్లు చెబుతున్నారు.

అర్థ‌రాత్రి వంట మొద‌లుపెట్టి.. ప‌క్క‌రోజు తొమ్మిది గంట‌ల స‌మ‌యానికే మొత్తం పూర్తి చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఆహార‌ప‌దార్థాల నాణ్య‌త ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉండేందుకు చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. మొత్తానికి ల‌క్ష‌లాది మందికి ఫుడ్ ప్యాకెట్స్ అందించ‌టం పెద్ద క్ర‌తువుగా చెప్పాలి. మ‌రి.. అంబికావారు ఎంత జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేస్తారో చూడాలి.