Begin typing your search above and press return to search.

పరిస్థితి చెబుతున్న పంజాగుట్ట ఫ్లై ఓవర్!

By:  Tupaki Desk   |   23 Sep 2016 9:25 AM GMT
పరిస్థితి చెబుతున్న పంజాగుట్ట ఫ్లై ఓవర్!
X
హైదరాబాద్ లో చెరువులు కబ్జాలకు గురయ్యాయని, నేతలు రోడ్లను సరిగా పట్టించుకోవడం లేదని, సమస్య వచ్చినప్పుడు హడావిడి చేయడం తర్వాతి వాటిని మరిచిపోవడం నిత్యకృత్యంగా పెట్టుకున్నారని తెలిసి బుద్ది చెప్పాలనో, తెలియక చేసిన పనో కానీ... భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇది పెద్ద వర్షమేమీ కాదు, మీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఈ పరిస్థితి అని వరుణుడువైపు వాళ్లు ఒకవైపు సమర్ధిస్తుంటే... ఇది గత పాలకుల చేతకానితనం అని ప్రస్తుత పెద్దలు అంటున్నారు. ఈ సంగతులు అలా ఉంటే... రోడ్లపై వాహనాల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. సరేలే హైదరాబాద్ లో ఫ్లై ఓవర్స్ ఉన్నాయి కదా వాటిపై వెళ్దామని అనుకుంటే... ఈ ఫోటో చూశాక ఆ అభిప్రాయం కూడా మారిపోతుంది.

ఈ ఫోటోలో కనిపిస్తున్నది కాలువ కాదు, వర్షాకాలంలోని హైదరాబాద్ రోడ్డు కాదు.. ఫ్లై ఓవర్! అవును భాగ్యనగరంలోని పంజాగుట్ట ఫ్లై ఓవర్. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ ఫ్లై ఓవర్ నీటితో నిండిపోయింది. ఫలితంగా ఇప్పుడు తనపై ఏ వాహనంతో వెళ్తారో చూస్తానని వెక్కిరింపు మాటలు మాట్లాడుతుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వందలాది అపార్టుమెంట్ల సెల్లార్లు ఇప్పటికే నీటితో నిండాయి. ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంట మంచిది. నిన్నటివరకూ లోతట్టు ప్రాంతాలకే ఈ పరిస్థితి అనుకుంటే... అలాంటి తేడాలు తనకేమీలేవని ఒకవైపు వరుణుడు, మరో వైపు భాగ్యనగరం తేల్చి చెప్పేశాయి. ఫలితంగా పంజాగుట్ట ఫ్లై ఓవర్ కు కూడా ఈ పరిస్థితి!!

గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై నీరు భారీగా ప్రవహించింది. ఆ సమయంలో తీసిన ఫొటో ఇది! ఈ ఫోటో చూస్తే.. పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై ఏమేర నీరు నిలిచిందో అర్థమవడంతో పాటు, ఫ్లై ఓవర్ కిందనున్న రోడ్డు పరిస్థి కూడా కళ్లకు కట్టినట్లు కనపడుతుంది!! ఇదే క్రమంలో హైదరాబాద్‌ లో మరో రెండురోజుల పాటు ఇలానే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది!