Begin typing your search above and press return to search.

నల్లా మీద కట్టేస్తే నీళ్లు ఊరుకుంటాయా? హైదరాబాద్ లో ఏం జరిగింది

By:  Tupaki Desk   |   9 Oct 2021 5:49 PM IST
నల్లా మీద కట్టేస్తే నీళ్లు ఊరుకుంటాయా? హైదరాబాద్ లో ఏం జరిగింది
X
అవును.. మీరు చూస్తున్న వీడియో నిజమే. హైదరాబాద్ లోని ఒక థియేటర్ లోకి వర్షం. ఎప్పుడూ చూడని సీన్. ఎలా సాధ్యం? ఇప్పటివరకు లోతట్టు ప్రాంతాల్లోకి వాన నీటితో నిండిపోవటం తెలిసిందే. కానీ.. థియేటర్ లాంటి బహుళ అంతస్తుల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగింది? థియేటర్లోకి అంతభారీగా వరద నీరు ఎలా వచ్చింది? ఇంతకూ ఆ థియేటర్ ఎక్కడుంది? లాంటి వివరాల్లోకి వెళితే..

శుక్రవారం రాత్రి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయమంతా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి.. సాయంత్రానికి మొత్తం సీన్ మారిపోయింది. పెద్ద ఎత్తున వర్షం కురవటంతో ఎప్పటిలానే పలు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. గడిచిన కొద్ది కాలంగా వర్షం పడితే చాలు.. హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యన కురిసిన వర్షాల కారణంగా ఒకరిద్దరు నాలాల్లో కొట్టుకు పోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. శుక్రవారం రాత్రి కురిసిన వానకు ఎప్పుడూ లేని రీతిలో ఒక సిత్రమైన సీన్ ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

దిల్ సుఖ్ నగర్ కు కూసింత దూరంగా ఉండే శివగంగా థియేటర్ ఉంది. రాత్రి కురిసిన వాన తీవ్రతకు నాలా పక్కనే ఉండే.. ఈ థియేటర్ లోకి వాన నీరు పెద్ద ఎత్తున రావటంతో ప్రహరీ గోడ దెబ్బ తినటమే కాదు.. థియేటర్ ప్రాంగణంలో ఉంచిన యాభై బైకులు ధ్వంసం కావటమే కాదు..వరద నీటిలో చిక్కుకుపోయాయి.సాయంత్రం ఫస్ట్ షో అయ్యాక .. బయటకు వచ్చిన వారికి భారీ వర్షం పడుతుండటంతో థియేటర్ ప్రాంగణంలో నిలుచొని ఉండటం.. అదే సమయంలో నాలా పక్కనే ఉన్న థియేటర్ ప్రహరీ గోడ కూలింది. దీంతో.. వరద నీరు పెద్ద ఎత్తున థియేటర్ ను ముంచెత్తింది. దీంతో.. థియేటర్ లోపల కూడా భారీ ఎత్తున నీరు చేరుకుంది.

నిజానికి ఈ డబుల్ థియేటర్.. దిల్ సుఖ్ నగర్ వాసులకు చాలా ఫేమస్. చాలా ఏళ్ల క్రితం నాలా పక్కనున్న స్థలంలో ఈ థియేటర్ ను నిర్మించారు. అయితే.. నాలాను కాస్తంత ఆక్రమించుకొని కట్టారన్న ఆరోపణ ఉంది. కానీ.. మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వటంతో నిర్మాణం పూర్తి అయ్యింది. దశాబ్దాల తరబడి ఉన్న థియేటర్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. ఇంతకాలం ఎన్నో వానల్ని చూశాం కానీ.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు. అయితే.. కొందరివాదన మాత్రం భిన్నంగా ఉంది.

నీరు తన దారి మర్చిపోదని.. ఏదో ఒక రోజున తన పాత దారిని పట్టుకొని వచ్చేస్తుందని.. తాజాగా అలాంటిదే జరిగిందన్న మాట వినిపిస్తోంది. నాలా పక్కనున్న థియేటర్ కు అందరూ అన్ని అనుమతులు ఇవ్వొచ్చు.. కానీ నీరు మాత్రం తన పాత దారిని వెతుక్కుంటూ రావటం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. తాజా ఉదంతంతో.. మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి.. అసలీ ఘటన ఎలా జరిగింది? థియేటర్ నిర్మాణంలో ఏమైనా తప్పులు చోటు చేసుకున్నాయా? అన్న విషయంపై ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. థియేటర్ లోపల పోటెత్తిన వర్షపు నీటి వీడియో చూసిన వారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి.