Begin typing your search above and press return to search.

పీకే పర్యటనలో ఊహించని ఘటన.. జగన్ పార్టీ ఎమ్మెల్యే తండ్రి

By:  Tupaki Desk   |   3 Dec 2020 10:16 AM IST
పీకే పర్యటనలో ఊహించని ఘటన.. జగన్ పార్టీ ఎమ్మెల్యే తండ్రి
X
అంచనాలకు తగ్గట్లే నివర్ తుపాను రైతుల్ని ముంచేసింది. పాడు తుపాన్ పోతూ పోతూ పంటలకు భారీగా నష్టం వాటిల్లేలా చేసింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం సరిగా స్పందించటం లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణా..గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

తాను రాజకీయం చేసేందుకు రాలేదన్న పవన్.. వరదల కారణంగా నష్టపోయిన వారికి హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం రూ.10వేలు చొప్పున పరిహారాన్ని చెల్లించిందని.. ఎకరం పొలం వర్షాల కారణంగా దెబ్బ తింటే జగన్ సర్కారు రూ.10వేలు ఇస్తామనటం సరికాదని.. ఎకరాకు రూ.25 నుంచి రూ.30వేల వరకు పరిహారం ఇవ్వాలని కోరారు. తన పర్యటన మొత్తం రాజకీయం ఏమీ లేదని.. కేవలం కష్టాల్లో ఉన్న రైతుల్ని పరామర్శించేందుకు.. వారికి భరోసా కలిగించేందుకే వచ్చినట్లుగా పేర్కొన్నారు.

పొలంలోకి స్వయంగా దిగి.. పంట నష్టం గురించి రైతుల నుంచి తెలుసుకున్న పవన్ చలించిపోయారు. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుతో పాటు.. పామర్రు.. మోపిదేవి.. అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు.. చావలి.. పెరవలి.. తెనాలి ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం ఒకటి చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి తండ్రి.. మాజీ ఎంపీ పెద రెడ్డయ్య కలిశారు. తుఫాన్ కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారన్నారు. ప్రభుత్వం నమోదు చేస్తున్న పంట నష్టం అంచనాలన్నీ తప్పులేనని ఆరోపించిన ఆయన.. ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగటం లేదన్నారు. ఈ సందర్భంగా స్పందించిన పవన్ కల్యాణ్.. రైతుల సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిద్దామని చెప్పారు. దీనికి స్పందించిన రెడ్డయ్య.. తాను కూడా వస్తానని చెప్పారు. పవన్ టూర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే తండ్రి హాజరై.. తన ఆవేదనను వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.