Begin typing your search above and press return to search.

ఇదెక్కడి న్యాయం? పెట్రోల్ కంటే విమాన ఫ్యూయల్ తక్కువ రేటా?

By:  Tupaki Desk   |   18 Oct 2021 10:55 AM IST
ఇదెక్కడి న్యాయం? పెట్రోల్ కంటే విమాన ఫ్యూయల్ తక్కువ రేటా?
X
న్యాయం అంటూ ఒకటి ఉంటుంది కదా? అన్న మాట తాజాగా వెల్లడైన వాస్తవం గురించి తెలిసినంతనే అప్రయత్నంగా నోటి నుంచి రావటం ఖాయం. ఎక్కడైనా పెట్రోల్.. డీజిల్ ధర ఎక్కువ ఉంటుందా? విమానాలు నడవటానికి ఉపయోగించిన ఫ్లైట్ కు వినియోగించే ఫ్యూయల్ ధర ఎక్కువ ఉంటుందా? అంటే.. విమాన ఇంధనమే ఎక్కువ ఉంటుందని భావిస్తాం కదా? కానీ.. అందుకు విరుద్ధంగా.. లీటరు పెట్రోల్.. డీజిల్ కంటే కూడా విమాన ఇంధన ధరలు చాలా చౌకగా ఉండటం విశేషం. గడిచిన కొద్ది రోజులుగా రోజు రోజుకు అంతకంతకూ పెరిగిపోయే పెట్రోల్.. డీజిల్ ధరలు దేశ ప్రజల్ని ఠారెత్తిస్తున్నాయి.

ప్రజలు ఎంతలా విరుచుకుపడుతున్నా.. విపక్షాలు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నా.. అవేమీ పట్టనట్లుగా వ్యవహరించటంలో కేంద్రంలోని మోడీ సర్కారు ముందుంది. అంతేకాదు.. క్యాలెండర్ లో తేదీ మారిన వెంటనే.. పెట్రోల్.. డీజిల్ ధర పెరిగే పరిస్థితి. అయినా.. ప్రజలంతా వినియోగించే పెట్రోల్.. డీజిల్ ధరలు తక్కువగా ఉండి.. విమానాలకు వినియోగించే ఫ్యూయల్ ధర తక్కువగా ఉండటం విస్మయానికి గురి చేస్తుంది.

అంతేకాదు.. ఈ ధర తేడా ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే. ఉదాహరణకు హైదరాబాద్ సంగతే చూద్దాం. ఇప్పుడు లీటరు పెట్రోల్ రూ.110.09 ఉంటే.. లీటరు డీజిల్ రూ.103.18గా ఉంది. అదే సమయంలో విమానాల్లో ఉపయోగించే ఇంధనమైన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ లీటరు కేవలం రూ.65 మాత్రమే కావటం గమనార్హం. అంటే.. లీటరుకు 45 రూపాయిలు తేడా ఉందన్నమాట.

ఇదే ముంబయిలో రూ.77.3 ఉంటే.. ఢిల్లీలో రూ.79.02గా ఉంది. ఇక చెన్నైలో రూ.81.20గా ఉంటే.. కోల్ కతాలో అత్యధికంగా రూ.83.02గా ఉంది. ఇక.. అత్యల్ప ధర విశాఖలో ఉండటం గమనార్హం. ఇక్కడ లీటరు రూ.60కే లభిస్తోంది. అంటే.. ఏకంగా లీటరుకు రూ.40 తక్కువగా ఉండటం గమనార్హం. ఎందుకిలా అంటే.. ఏ రోజుకు ఆ రోజు అంతర్జాతీయ ధరల్ని ఆధారంగా చేసుకొని పెంచటం అనే ప్రక్రియ కొద్ది నెలలుగా నిర్విరామంగా చేయటమే తాజా పరిస్థితికి కారణమని చెప్పాలి. సామాన్యులు ఉపయోగించే పెట్రోల్.. డీజిల్ ధరల్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఏమైనా.. ఇలాంటి సిత్రం మనకు మాత్రమే సొంతమేమో?