Begin typing your search above and press return to search.

కోహ్లి-మ్యాచ్ ఫిక్సింగ్.. సూపరెహే!

By:  Tupaki Desk   |   20 Jun 2017 11:25 AM GMT
కోహ్లి-మ్యాచ్ ఫిక్సింగ్.. సూపరెహే!
X
అప్పట్లో 2003 ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ ఇండియా ఓడిపోగానే మరుసటి రోజు ఉదయానికి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించిన పాంటింగ్ బ్యాట్ లో ఏదో లోహం పెట్టుకున్నాడని.. అది అంపైర్లకు తర్వాత తెలిసిందని.. ఈ మ్యాచ్ ను మళ్లీ నిర్వహిస్తారని ఓ ప్రచారం నడిచింది. అప్పట్లో మీడియా.. సోషల్ మీడియా ఇప్పట్లా యాక్టివ్ గా ఉండేది కాదు. అభిమానులు ఇలాంటి ప్రచారాల్ని కూడా నమ్మేసి మళ్లీ ప్రపంచకప్ ఫైనల్ జరుగుతుందని కూడా ఆశించారు పాపం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మీడియా.. సోషల్ మీడియా విస్తృతమయ్యాయి. కాబట్టి ఏవైనా చెత్త ప్రచారాలు జరిగితే జనాలు నమ్మరని అనుకుంటాం. జనాల్లో చైతన్యం ఎక్కువై ఉంటుందని ఆశిస్తాం.

కానీ తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా ఓడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో.. ఇతర మీడియాల్లో జరుగుతున్న చర్చలు చూస్తే నవ్వు రాకమానదు. వీళ్లెప్పుడు మారతారో అని ఆశ్చర్యపోవాల్సిందే. ఈ టోర్నమెంట్ అంతా కూడా ఫిక్సింగ్ జరిగిందట.. ఫైనల్లో కూడా కోహ్లీ సేన ఫిక్సింగ్ కు పాల్పడిందట. అందుకే టాస్ గెలవగానే కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడట. బుమ్రా కావాలనే నోబాల్ వేశాడట. అందరూ కలిసి పాకిస్థాన్ ను గెలిపించారట. సెమీఫైనల్లో అంతకుముందు.. లీగ్ దశలో శ్రీలంక కూడా కావాలని ఓడిపోయాయట. వీటన్నింటి వెనుక ఐసీసీ హస్తం కూడా ఉందని సందేహాలు వ్యక్తం చేసేస్తున్నారు. ‘ఇకనైనా మా దేశానికి రండి’ అంటూ పాకిస్థాన్ కెప్టెన్ వ్యాఖ్యానించడం ఈ సందేహాలకు బలం చేకూరుస్తోందని కూడా తీర్మానిస్తున్నారు. అంటే.. ఇదంతా పాకిస్థాన్ కు అన్ని జట్లనూ రప్పించడానికి అందరూ కలిసి ‘ఫిక్సింగ్’కు పాల్పడి ఆడిన నాటకం అన్నది ఈ మేధావుల అనుమానం.

అసలు ఏ అంతర్జాతీయ జట్టయినా పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లట్లేదనే మౌళిక ప్రశ్నకు సమాధానం వెతకాలి ముందు. అక్కడ శ్రీలంక జట్టు మీద ఉగ్రదాడిని ఎవ్వరూ మరిచిపోలేదు. ఆ దాడిలో గాయపడ్డ సమరవీర అంతర్జాతీయ కెరీర్ కే ముగింపు పలకాల్సి వచ్చింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు అక్కడ పర్యటిస్తుండగా.. స్టేడియం పక్కనే పెద్ద ఉగ్రదాడి జరిగింది. ఆ జట్టు అర్ధంతరంగా పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. మిగతా జట్ల సంగతలా ఉంచితే.. భారత్ కు భద్రత విషయంలో కంటే పాక్ లో పర్యటించడానికి వేరే అభ్యంతరాలు చాలానే ఉన్నాయి. తమ మీద ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతున్న పాకిస్థాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్థాన్ కు మళ్లీ అంతర్జాతీయ జట్లను రప్పించడానికి కోహ్లీ సేన ఇతోధికంగా సాయం చేస్తుందా? ఎవరికి వారు పాకిస్థాన్ కు వెళ్లడానికి ససేమిరా అంటుంటే అందరూ కలిసి టోర్నీని ‘ఫిక్స్’ చేసి పాకిస్థాన్ విజయానికి తోడ్పడతారా? పాకిస్థాన్ గెలిచినంత మాత్రాన అందరూ ఆ దేశానికి వెళ్లిపోతారా?

పోనీ డబ్బుల కోసం మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడటం అంటే.. అది సాధారణంగా పాకిస్థాన్ ఆటగాళ్లు చేసే పని. మిగతా దేశాల ఆటగాళ్లతో పోలిస్తే వారికి ఆదాయం తక్కువ. ఆ దేశ క్రికెట్లో అవ్యవస్థ ఎక్కువ. సరైన దిశానిర్దేశం ఉండదు. అందుకే తమ జట్టు ఓడిపోయేలా ఫిక్సింగ్ పాల్పడటానికి ఆ జట్టు ఆటగాళ్లు ముందుకొస్తుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలున్నాయి. అంతే తప్ప పాకిస్థాన్ ను గెలిపించడానికి వేరే దేశాల ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడటం అన్నది వినడానికి కామెడీగా అనిపిస్తుంది. సక్రమంగా ఆడుతూ వందల కోట్లు ఆర్జిస్తున్న కోహ్లి.. కొన్ని కోట్ల కోసం వక్రమార్గం పడతాడా? ఇలాంటి ఆరోపణలు చేసేవారికి కాస్తయినా ఇంగితం ఉండొద్దా? బాగా ఆడనందుకు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నందుకు కోహ్లిని విమర్శిస్తే విమర్శించొచ్చు కానీ.. ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం మాత్రం అవగాహన రాహిత్యం తప్ప మరొకటి కాదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/