Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మార్వో ఇంట్లో ఫైవ్ స్టార్ స్థాయిలో మినీ బార్

By:  Tupaki Desk   |   16 Aug 2020 1:40 PM IST
ఆ ఎమ్మార్వో ఇంట్లో ఫైవ్ స్టార్ స్థాయిలో మినీ బార్
X
ఒక భూవివాదానికి సంబంధించి ఒక ఎమ్మార్వో స్థాయి అధికారి ఎంతమేర లంచం తీసుకునే ఛాన్సు ఉందన్న ప్రశ్నకు ఏ ఒక్కరు రై.1.10కోట్లు అన్న మాట అయితే చెప్పరు. ఆ మాటకు వస్తే.. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడిన వేళలో..రూ.1.10కోట్ల మొత్తాన్ని పట్టుకున్న మొదటి సందర్భంగా ఇదేనని చెబుతారు. కీసర ఎమ్మార్వో నాగరాజు భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవటం హాట్ టాపిక్ గా మారింది.

గతంలో ఒకసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్ కు గురైన ఆయన.. తర్వాతి కాలంలో ఎమ్మార్వోగా ఎదగటమే కాదు.. భూభాగోతాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే పోస్టింగులు తెచ్చుకోవటంలో ఆయనకు ఆయనే సాటిగా చెబుతారు. అలాంటి ఆయనపై ఏసీబీ నిఘా పెట్టటం.. తాజాగా ఆయన్ను బుక్ చేయటం సంచలనంగా మారింది. ఎమ్మార్వో నాగరాజు ఎపిసోడ్ తర్వాత మరోసారి రెవెన్యూలో లంచాల భాగోతం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

పని చేసేది కీసరలో అయినా.. ఆయనకు హైదరాబాద్ అల్వాల్ లో ఒకటి.. ఏఎస్ రావు నగర్ లో మరొక ఇల్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఇళ్లల్లో ఏర్పాటు చేసుకున్న బార్ ఏసీబీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవినీతి భాగోతాలకు సంబంధించి పలు ఇళ్లల్లో తనిఖీలు చేసే అధికారులు.. నాగరాజు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న బార్ మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అని చెబుతున్నారు. ఖరీదైన మద్యం సీసాలతో ఉన్న ఆ ఇంటి బార్.. ఫైవ్ స్టార్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గదని చెబుతున్నారు.

ఏడాదిలో నాలుగు నెలలు అల్వాల్ లో.. మరో ఎనిమిది నెలలు ఏఎస్ రావు నగర్ లో ఉంటారని చెబుతున్నారు. రెండు ఇళ్లల్లోనూ ఫైవ్ స్టార్ సదుపాయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఇంటికి తరచూ ఖరీదైన వాహనాలు బారులు తీరుతుంటాయన్న మాట వినిపిస్తోంది. రూ.1.10 కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. తదనంతరం జరిపిన సోదాల్లో ఆయన కారులో రూ.8లక్షలు.. ఇంట్లో రూ.28 లక్షల నగదుతో పాటు.. మరికొన్ని ఆస్తుల పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. బ్యాంకు లాకర్లో ఉన్న రెండు కేజీల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ రెవెన్యూ అధికారి ఇళ్లు ఉన్నట్లుగా అధికారులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.