Begin typing your search above and press return to search.

యూపీ సీఎం అయ్యేది ఈ ఐదుగురిలో ఒక‌రే

By:  Tupaki Desk   |   11 March 2017 6:42 AM GMT
యూపీ సీఎం అయ్యేది ఈ ఐదుగురిలో ఒక‌రే
X
ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని స్పష్ట‌మైపోయింది. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని స్ప‌ష్ట‌మైంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారం దక్కించుకుంటే సీఎం ఎవరనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం ఈ ఐదుగురిలో ఒక‌రు సీఎం అయ్యే అవ‌కాశం ఉంది.

కేశవ్ ప్రసాద్ మౌర్య..

సీఎం అభ్యర్థిగా యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య(47) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఫుల్పుర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో వేదికలపై పెద్దగా కనిపించకపోయినా.. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రణాళికలు రచించారు. ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే యాదవేతరుల (ఓబీసీలు) మద్దతును కూడగట్టవచ్చని బీజేపీ భావిస్తున్నది.

రాజ్‌ నాథ్ సింగ్..

కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ పేరును యూపీ సీఎం అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన 2002లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం, పార్టీలో పలు కీలక పదవులతోపాటు బీజేపీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేయడం కలిసొచ్చే అంశాలు. ఎన్నికల ప్రచారంలో 120కి పైగా ర్యాలీలు నిర్వహించారు. ఇవన్నీ ఆయన్ను యూపీ సీఎం అభ్యర్థిత్వానికి దగ్గర చేస్తున్నాయి. అయితే ఢిల్లీ రాజకీయాలను వదిలి వస్తారా అనేది ఎదురుచూడాల్సి ఉన్నది.

మనోజ్ సిన్హా..

ఘాజీపూర్ ఎంపీ మనోజ్ సిన్హా (57) పేరు సైతం యూపీ సీఎం అభ్యర్థుల రేసులో ప్రముఖంగా వినిపిస్తోందిది. ప్రస్తుతం ఆయన రైల్వే, టెలికాం సహాయమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు కావడంతో పార్టీ ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

యోగి ఆదిత్యనాథ్

సీఎం పీఠం రేసులో గోరఖ్‌పూర్ ఎంపీ, ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ పేరు అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశం.

వరుణ్ గాంధీ..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సుల్తాన్‌పూర్ ఎంపీ వరుణ్‌గాంధీని బీజేపీ పూర్తిగా పక్కనబెట్టింది. ఆయన్ను సీఎం అభ్యర్థిగా తెరమీదికి తెచ్చే అవకాశాలు మాత్రం లేకపోలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/