Begin typing your search above and press return to search.

5 రోజులే గ‌డువు!..ఆ త‌ర్వాత ఇబ్బందే!

By:  Tupaki Desk   |   1 Feb 2019 4:35 PM GMT
5 రోజులే గ‌డువు!..ఆ త‌ర్వాత ఇబ్బందే!
X
అమెరికా క‌ల నెర‌వేర్చుకునేందుకు రెక్క‌లు క‌ట్టుకుని అగ్ర‌రాజ్యం వెళ్లిన మ‌న విద్యార్థుల‌కు ఇప్పుడు నిజంగానే డేంజ‌ర్ బెల్స్ వినిపిస్తున్నాయి. ఉన్న‌ప‌ళంగా పెట్టేబేడా స‌ర్దుకుని స్వ‌దేశం వ‌చ్చేస్తే స‌రి. లేదంటే తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అమెరికాకు వెళ్ల‌డ‌మే ధ్వేయంగా పెట్టుకున్న మ‌న విద్యార్ధులు తాము విద్య‌న‌భ్య‌సించేందుకు ఎంచుకున్న వ‌ర్సిటీల గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకోకుండానే ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఫ్లైటెక్కేశారు. తీరా అక్క‌డికి వెళ్లాక‌... క్లాసుల‌కు వెళ్లాల్సిన ప‌ని లేద‌ని తెలిసి ఆందోళ‌న‌కు గురి కావాల్సిందిపోయి... సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. అవ‌కాశం అందివ‌చ్చింద‌ని దొరికిన చోట అప్ప‌టిక‌ప్పుడు కొలువుల్లో చేరిపోయారు. చ‌దువుకునేందుకు పార్ట్ టైం ఉద్యోమైతే ఫ‌ర‌వా లేదు గానీ... అస‌లు చ‌దువు పేరిటే సంపాద‌న కోస‌మే అక్క‌డికి వెళ్ల‌డ‌మంటే దుస్సాహ‌స‌మే క‌దా. అందులోనూ క‌ఠిన చ‌ట్టాలు అమ‌ల‌య్యే అమెరికాలో ఈ త‌ర‌హా దుస్సాహ‌సం మ‌రింత‌గా ప్ర‌మాదం కొనితెచ్చుకోవ‌డ‌మే. ఇప్పుడు అక్క‌డ న‌కిలీ వ‌ర్సిటీల్లో చేరిన మ‌న విద్యార్థుల ప‌రిస్థితి ఇలానే ఉంది.

అమెరికా పోలీసుల స్టింగ్ ఆప‌రేష‌న్ వ‌ల్ల అడ్డంగా దొరికిపోయిన మ‌నోళ్లు ఇప్పుడు చాలా ఇబ్బందుల‌కు గురి కావాల్సి వస్తోంది. దేశం కాని దేశం వెళ్లిన పిల్ల‌ల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మార‌డంతో ఇక్క‌డున్న వారి ఫ్యామిలీలు తీవ్ర ఆందోళ‌న‌లో కూరుకుపోయాయి. న‌కిలీ వ‌ర్సిటీల్లో మ‌న వాళ్ల‌ను చేర్చిన కొంద‌రు మ‌న వాళ్లు అక్క‌డి చ‌ట్టాల‌కు బ‌లి కానుండ‌గా... వారి ఉచ్చులో చిక్కుకుని అన్యాయం అయిపోయిన విద్యార్థుల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌శ్న‌. స్టూడెంట్‌, రీసెర్చి స్కాల‌ర్‌, వొకేష‌న‌ల్ వీసాల కింద అమెరికాకు వెళ్లిన చాలా మంది అక్క‌డ వారి నిర్దేశిత కాల ప‌రిమితి ముగిసినా... చ‌ట్టాలేం చేస్తాయిలే అన్న ధీమాతో అక్క‌డే ఉండిపోయారు. చేతికందుతున్న అధిక ఆదాయం వారిని తిరిగి వ‌చ్చేందుకు వెనుకంజ వేయిస్తోంది. ఈ నేప‌థ్యంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న అక్ర‌మ వ‌ల‌స‌దారుల స‌మ‌స్య‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్న అమెరికా ఇప్పుడు కొర‌డాను కాస్తంత గ‌ట్టిగానే ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ త‌ర‌హా ప‌రిస్థితికి దారి తీసిన కార‌ణాల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే...అమెరికాలో గ‌తేడాది ఆగ‌స్టు 9న అమ‌ల్లోకి వ‌చ్చిన‌ *యాక్చువ‌ల్ ఆప్ అన్ లాఫుల్ ప్ర‌జెన్స్ ఆఫ్ ఎఫ్‌ - జే అండ్ ఎం నాన్ ఇమ్మిగ్రాంట్స్‌* చ‌ట్టం ప్ర‌కారం నిర్దేశిత కాలం ముగిసినా ఇంకా అక్క‌డే ఉంటున్న వారంతా తిరిగి వారి వారి దేశాల‌కు వెళ్లేందుకు 180 రోజుల గ‌డువు ఉంది.

అయితే ఆ గ‌డువు ఈ నెల 5న అంటే... మ‌రో ఐదు రోజుల్లో తీరిపోనుంది. ఈలోగా నిర్దేశిత కాల‌మానాన్ని మించి అక్క‌డే ఉంటున్న దాదాపు 16,62,369 మంది (2017 చివ‌రి నాటి లెక్క‌ల ప్ర‌కారం) మ‌రో ఐదు రోజుల్లోగా ఆ దేశం విడిచి వెళ్లాల్సిందే. ఈ సంఖ్య ఈ రెండేళ్ల‌లో మ‌రింత‌గా పెరిగే ఉంటుంద‌ని అంచ‌నా. వీరందరూ త‌క్ష‌ణ‌మే అమెరికాను వీడాల్సిందే. లేదంటే... అక్ర‌మ వ‌ల‌స‌దారులుగా ముద్ర‌ప‌డిపోతారు. అక్క‌డి చ‌ట్టాల‌కు అడ్డంగా దొరికిపోవ‌డంతో పాటుగా జైలుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి. ఈ త‌ర‌హా వారిలో తెలుగోళ్ల సంఖ్య కూడా భారీగానే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే తాము చేరిన విద్యాల‌యాల్లో నిర్దేశిత కాలంలోగా విద్యాభ్యాసం పూర్తి కాని విద్యార్థులు కూడా చాలా మందే ఉన్నారు. మ‌రి వీరి ప‌రిస్థితిపై అమెరికా చ‌ట్టాలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తాయ‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏది ఏమైనా... అక్క‌డి చ‌ట్టాలు అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నామ‌ని చెప్పిన నేప‌థ్యంలో ఆ జాబితాలో ఉన్న మ‌నోళ్లంతా త‌క్ష‌ణ‌మే తిరుగు ప‌య‌నం కావాల్సిందే. ఆచ‌ర‌ణ‌లో అంత ఈజీ కాకున్నా... సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే ఆ దేశం విడిచి వ‌చ్చేయ‌డ‌మే మంచిద‌న్న వాద‌న వినిపిస్తోంది.