Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 1.. కొత్త మార్పులకు రెఢీ కండి!

By:  Tupaki Desk   |   30 March 2021 1:30 PM GMT
ఏప్రిల్ 1.. కొత్త మార్పులకు రెఢీ కండి!
X
క్యాలెండర్లో తేదీలు మారటం రోజూ జరిగేదే. నెలకోసారి మారే నెలలో వచ్చే మొదటి తేదీ చాలామందికి ఇష్టం. ఎందుకంటే.. ఆ రోజే తమకు జీతం వచ్చేస్తుంటుంది కాబట్టి. అయితే.. కొన్నిసార్లు మాత్రం ఒకటో తేదీ వస్తుందంటేనే గుండె దడ మొదలవుతుంది. అందునా ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజు కొన్నిసార్లు కొత్త మార్పులకు నెలవుగా మారుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ ఒకటి వచ్చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ఏప్రిల్ 1 నుంచి సగటుజీవి మొదలుకొని కార్పొరేట్ కంపెనీ వరకు చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి.. అందులో మీ మీద ప్రభావం చూపించే అంశాలు.. ఎవరికి వారు మారాల్సిన అంశాలు ఉన్నాయి. మరి.. అవేమిటో చూద్దామా?

1. మీ దగ్గరున్న ఆ చెక్కు బుక్కలు చెల్లవు
ఆ మధ్యన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కావటం తెలిసిందే. ఉదాహరణకు ఆంధ్రాబ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకు కలిసి యూనియన్ బ్యాంకులో విలీనం కావటం తెలిసిందే. అదే రీతిలో కార్పొరేషన్ బ్యాంకు.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్.. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అలహాబాద్ బ్యాంకు.. ఏడు బ్యాంకులకు చెందిన పాస్ పుస్తకాలు.. చెక్కు పుస్తకాలు ఏప్రిల్ 1 నుంచి పని చేయవు. ఒక్కో బ్యాంకు మరో బ్యాంక్ లో విలీనం కావటంతో.. కొత్త బ్యాంకు చెక్కు పుస్తకాల్ని తీసుకోవాలి. ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకు ఖాతాలున్న వినియోగదారులు తాజాగా విలీనమైన యూనియన్ బ్యాంకు చెక్కు పుస్తకాల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తమకు బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంకు ఏ బ్యాంకులోఅయితే విలీనం అయ్యిందో ఆ బ్యాంకు చెక్ పుస్తకాన్ని.. పాస్ పుస్తకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

2. ఐటీ రిటర్ను దాఖలు చేయకుంటే ఆ భారం తప్పదు
ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేయకుంటే.. బ్యాంకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు రెట్టింపు కానుంది. ఆదాయ పన్ను శ్లాబులో లేని వారు ఐటీఆర్ దాఖలు చేయకుంటే.. రెట్టింపు టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ రిటర్నులను అందరూ దాఖలు చేయటానికి వీలుగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గడిచిన రెండేళ్లలో రూ.50వేలు.. అంతకంటే ఎక్కువ టీడీఎస్ .. టీసీఎస్ ఉన్న వారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు లేదంటే ఐదు శాతాన్ని వసూలు చేస్తారు.

3. వాటిని కొనబోతుంటే.. ధరల షాక్ తప్పదు
ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా కార్లు.. బైకులు.. ఏసీల ధరలు పెంచేస్తున్నారు. నిజానికి కొన్ని కంపెనీలు జనవరి నుంచే ధరల్ని పెంచేశాయి. అంతర్జాతీయంగా కొన్ని వస్తువుల సరఫరాలో చోటు చేసుకున్న కొరత.. లోహ ధరలు పెరగటంతో కార్లు.. బైకుల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీవీలు.. ఏసీల ధరలు సైతం రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెరగనున్నాయి.

4. విమాన ప్రయాణం కూడా ఖరీదే
ఈ ఏప్రిల్ ఒకటి నుంచి విమాన ప్రయాణికుల మీద టికెట్ భారం మరింత పెరగనుంది. విమాన టికెట్లకు సామాన్య.. మధ్య తరగతి వారికి లింకేమిటంటారా? విమాన ఛార్జీల్ని తగ్గించిన క్రమంలో చాలామంది విమాన ప్రయాణాల్ని చేస్తున్నారు. అలాంటి వారికి కాస్త భారం తప్పనట్లే. దేశీయ.. అంతర్జాతీయ ప్రయాణికులపై ఏవియేషన్ సెక్యురిటీ ఫీజు పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం కారణంగా దేశీయ ప్రయాణికుల మీద రూ.200.. అంతర్జాతీయ ప్రయాణికుల మీద 12 డాలర్లు అదనంగా భారం పడనుంది. అయితే.. రెండేళ్ల వయసులో ఉన్న చిన్నారులకు.. డిప్లొమాటిక్ పాస్ పోర్టులు ఉన్న వారికి.. మరికొన్ని ప్రత్యేక వర్గాల వారి మీదా ఈ భారం పడదు.

5. ఆ ఖాతాలో పొదువు మీద పన్నుపోటు
సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేయకుండా పొదుపు చేసినా కూడా పోటు తప్పేట్లు లేదు. ఉద్యోగ భవిష్య నిధి అదేనండి ఈపీఎఫ్ ఖాతాలో పెట్టే పెట్టుబడులు ఆదాయ పన్ను నుంచి తప్పించుకోవు ఈ ఏప్రిల్ ఒకటి నుంచి. బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం రూ.2.5లక్షల కంటే ఎక్కువ ఈపీఎఫ్ లో పెట్టుబడి పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధించనున్నారు. ప్రైవేటు ఉద్యోగులు వడ్డీపై పన్ను పడకూడదంటే.. ఈపీఎఫ్.. వీపీఎఫ్ కలిసి గరిష్ఠంగా రూ.2.5లక్షలు మాత్రమే జమ చేసుకోవాలి. అయితే.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం రూ.5లక్షలు వరకు జమ చేసుకున్నా వారిపై వడ్డీ పడదు.