Begin typing your search above and press return to search.

జగన్ కేబినెట్.. ఆ ఐదుగురు మంత్రులే సేఫ్

By:  Tupaki Desk   |   23 Aug 2019 10:17 AM IST
జగన్ కేబినెట్.. ఆ ఐదుగురు మంత్రులే సేఫ్
X
జగన్ ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులకు చేరువువుతోంది. 100 డేస్ పండుగ చేసుకోవడానికి వైసీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అయితే రెండున్నరేళ్లలో మళ్లీ మాకు మంత్రి పదవులు వస్తాయని పార్టీలోని సీనియర్లంతా గంపెడాశలు పెట్టుకున్నారట..

తాజాగా సామాజిక కోణంలో మంత్రి పదవులు చేపట్టిన కొత్తవారు - ఇంకొందరి పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్టు వినికిడి. వీరంతా రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోవడం గ్యారెంటీ అన్న ప్రచారం వైసీపీలో సాగుతోంది. మరి జగన్ తోపాటు పూర్తి స్థాయిలో కేబినెట్ లో ఉండే మంత్రులు ఎంత మంది అనే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో సాగుతోంది.

పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ తోపాటు ప్రస్తుతం ఉన్న 25మంది మంత్రుల కేబినెట్ లో కేవలం ఐదుగురు మాత్రమే సేఫ్ అని విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ ఐదుగురు ఐదేళ్ల పాటు మంత్రులుగా ఉంటారని.. మిగతా 20 మంది మారుతారని ఘంటా పథంగా చెబుతున్నారు. మరి జగన్ మెచ్చిన ఆ ఐదుగురు ఎవరంటే వీరేనట..

సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడే పూర్తి హామీ లభించిన మంత్రులు ఐదుగురు ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వారిలో మొదటి హామీ పొందింది మోపిదేవీ వెంకటరమణ అట.. ఈయన మొన్నటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె లో పోటీచేసి ఓడిపోయారు. అయినా పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో నడిచిన మోపిదేవీని ఎమ్మెల్సీ చేసి మరీ జగన్ కేబినెట్ లో చోటు కల్పించారు. ఈయన ఐదేళ్లు మంత్రిగా ఉండడం గ్యారెంటీ అన్న సంకేతాలు ఇచ్చారట.. ఐదేళ్ల పాటు ఈయన మంత్రిగా ఉంటారని.. జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఇక వైఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఆయన మరణానంతరం జగన్ వెంట నడిచిన కీలక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈయనను కూడా జగన్ మంత్రిని చేశారు. పైగా బీసీ నేత కావడంతో ఈయన ఐదేళ్లు గ్యారెంటీ అన్న చర్చసాగుతోంది. ఇక జగన్ కు ఆర్థికంగా - నైతికంగా ప్రతిపక్షంలో ఉండగా మద్దతుగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరు. ఈయన ఐదేళ్లు మంత్రివర్గంలో ఉండడం గ్యారెంటీ అన్న సంకేతాలు ఉన్నాయట.. సీమ - కృష్ణ - గుంటూరు రాజకీయాలను జగన్ ఈయనకే కట్టబెట్టినట్టు సమాచారం. ఇక వైసీపీ సీనియర్ నేతల్లో బొత్సా సత్యనారాయణ ఒకరు. వైఎస్ హయాం నుంచి వీరి ఫ్యామిలీకి నమ్మినబంటు. ఈయన ఐదేళ్లు మంత్రిగా ఉండడం గ్యారెంటీనే అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఉత్తరాంద్రలో కీలక నేత కావడంతో ఈయనను మార్చే సాహసం పార్టీ చేయలేదు. ఇక జగన్ తోపాటు కష్టాల్లో - ప్రతిపక్షంలో ఉన్నా నడిచిన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్ ఫ్యామిలీకి కూడా దూరపు బంధువు. ఈయనకు కూడా జగన్ మంత్రిగా భరోసా ఇచ్చారని ప్రచారం సాగుతోంది.

మొత్తంగా వైసీపీలో కేవలం ఐదుగురు మంత్రులే పూర్తి స్థాయిలో ఐదేళ్లు కొనసాగే చాన్స్ ఉందట.. మిగతా అంతా రెండున్నరేళ్ల తర్వాత మారిపోవడం ఖాయమనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది.