Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లో ఐదున్నర గంటల భేటీ.. కేసీఆర్ వారికిచ్చిన హామీలేంటి?

By:  Tupaki Desk   |   10 March 2021 4:53 AM GMT
ప్రగతిభవన్ లో ఐదున్నర గంటల భేటీ.. కేసీఆర్ వారికిచ్చిన హామీలేంటి?
X
ఏది ఎప్పుడు చేయాలనే దానిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఆయన తాజా భేటీ చూస్తే.. ఈ మాటలకు తగ్గట్లే ఉందన్న భావన కలుగక మానదు. వేతన సవరణ కమిషన్ తన నివేదికను గత డిసెంబరులో ప్రభుత్వానికి అందించగా.. తొలిసారి ఉద్యోగ.. ఉపాధ్యాయ సంఘాలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్రగతిభవన్ లో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన భేటీ నాన్ స్టాప్ గా ఐదున్నర గంటల పాటు సాగింది.

ఇంత సుదీర్ఘంగా సాగిన భేటీ సందర్భంగా తనతో భేటీ అయిన వారి కడుపునింపేలా.. వారి ముఖాల్లో సంతోషంతో వెలిగిపోయేలా కొన్ని నిర్ణయాల్ని వెల్లడించి.. ఎన్నికల అనంతరం అధికారికంగా చెబుతామని చెప్పి పంపినట్లుగా తెలుస్తోంది. ఓవైపు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. తాజా భేటీ ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో కేసీఆర్ సర్కారు తీరుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహంవ్యక్తమవుతోందన్న మాట వినిపిస్తోంది.

అలాంటి మాటలకు కాలం చెల్లేలా.. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించటం ద్వారా కేసీఆర్ తాజాగా వారి మనసుల్ని దోచేశారంటున్నారు. ఉద్యోగ.. ఉపాధ్యాయులకు 7.5 శాతం ఫిట్ మెంట్ అమలుకు కమిషన్ సిఫార్సు చేయటం.. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన భేటీలో ఏపీలో అమలవుతున్న 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)కి మించి మరో రెండు శాతాన్ని పెంచి ఇస్తామన్న మాట సీఎం కేసీఆర్ నోట వచ్చిందని.. ఎన్నికల కోడ్ ఉన్నందున.. త్వరలోనే దాన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినట్లు చెబుతున్నారు.

ఏపీలోనే 27 శాతం ఐఆర్ ఇస్తున్నారు. మన దగ్గర ఇంకా ఎక్కువ ఉండాలన్న ఉద్యోగ సంఘాల మాటకు స్పందించిన సీఎం.. రెండు శాతం ఎక్కువ ఇస్తానని చెప్పి..ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. వయో పరిమితి పెంపుపై నిర్ణయాన్ని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం మాదిరే రాష్ట్రంలో ఉపాధ్యాయ.. ఉద్యోగ.. పెన్షనర్లకు ఆరోగ్య పథకం అమలు చేస్తామని.. అందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. కార్డు ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేర్చుకోవటం లేదని.. ప్రతి నెలా ఉద్యోగ.. ఉపాధ్యాయుల వేతనాల నుంచి కొంత మొత్తానని ఆరోగ్య పథకం కోసం వినియోగించాలని.. ప్రీమియం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని రాష్ట్రానికి రప్పిస్తామని.. ఏపీలో 1218 మంది తెలంగాణ ఉద్యోగులు పని చేస్తున్నారని.. వారందరిని రాష్ట్రానికి తీసుకురావటానికి వీలుగా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళలో.. సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తాజా వరాలు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.