Begin typing your search above and press return to search.

తండ్రీకొడుకుల పుణ్యమా అని మహారాష్ట్ర చరిత్రలో తొలిసారి ఆ సీన్

By:  Tupaki Desk   |   28 Nov 2019 6:47 AM GMT
తండ్రీకొడుకుల పుణ్యమా అని మహారాష్ట్ర చరిత్రలో తొలిసారి ఆ సీన్
X
అరుదైన సన్నివేశం మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారి ఆవిష్కృతం కానుంది. ఇప్పటివరకూ పార్టీలెన్నో ఉన్నా.. నేతలెందరో ఉన్నా చోటు చేసుకోని సరికొత్త సిత్రం ఈ రోజు చోటు చేసుకోనుంది. తండ్రి ముఖ్యమంత్రిగా కొడుకు ఎమ్మెల్యేగా మహారాష్ట్ర అసెంబ్లీలో కనిపించటం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ అలాంటిదెప్పుడూ మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోలేదు.

మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సందర్భాల్లో ఇలాంటి సీన్ కనిపించటమే కాదు.. ఇప్పుడు తెలంగాణలో తండ్రి ముఖ్యమంత్రి అయితే..కొడుకు మంత్రిగా ఉండటం తెలిసిందే. మహారాష్ట్రకు సంబంధించినంతవరకూ ఇలాంటి రికార్డు తొలిసారి చోటు చేసుకుంటోంది. ఇదో అరుదైన రికార్డుగా చెబుతున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగింది లేదు. తొలిసారి ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో నిలవటం గెలవటం ఈ ఎన్నికల్లోనే చోటు చేసుకుంది. ఉద్దవ్ ఠాక్రే ఇప్పటివరకూ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు.
దీంతో.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆర్నెల్ల లోపు ఆయన అసెంబ్లీ స్థానం నుంచి కానీ.. మండలి ద్వారా కానీ ఎన్నిక కావాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రికొడుకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా వ్యవహరించినప్పటికీ.. ఒకే సమయంలో తండ్రిసీఎం.. కొడుకు ఎమ్మెల్యే మాత్రం ఇదే తొలిసారిగా చెప్పాలి.

మహారాష్ట్రలో ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా ముఖ్యమంత్రులు అయ్యారు. బీజేపీకి సంబంధించి ఇద్దరు సీఎంలు అయితే.. శివసేన నుంచి తొలి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేనే. కొత్త ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన ఎన్సీపీ నుంచి ఇప్పటివరకూ ఏ నేతా ముఖ్యమంత్రి అయ్యింది లేదు. మరి.. తండ్రి కొడుకులు ఒకేసారి అసెంబ్లీలో కనిపించనున్న అరుదైన రికార్డును సొంతం చేసుకున్న వారిద్దరూ రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని ఏ రీతిలో ప్రభావితం చేస్తారో చూడాలి.