Begin typing your search above and press return to search.

మొదటిసారి గుండె పోటుకు అంత తీవ్రత ఎందుకంటే?

By:  Tupaki Desk   |   21 Feb 2022 3:20 AM GMT
మొదటిసారి గుండె పోటుకు అంత తీవ్రత ఎందుకంటే?
X
ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య గుండెపోటు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగిన వ్యక్తులు కూడా.. హార్ట్ ఎటాక్ కారణంగా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. జీవ గడియారం లో మార్పు, సమయానికి తినకపోవడం, కొవ్వులు వంటి కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది.

గుండెపోటు వచ్చిన వారిలో కొందరికి తీవ్రంగా మరికొందరిలో స్వల్పంగా ఉంటుంది. అయితే ఇంకొందరిలో అయితే ఏకంగా మొదటి సారి తీవ్రత ఎక్కువగా ఉండి... ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

శరీరంలో ప్రతి అవయవానికి రక్తనాళాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్, పోషకాలు వంటి వాటిని అవయవాలకు అందిస్తాయి. ఇలాగే గుండెకు కూడా ఇవి అవసరం. అయితే గుండెకు రక్తాన్ని తీసుకొనిపోయే నాళాల్లో కొవ్వు పేరుకుపోతే... రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో గుండెకు పోషక పదార్ధాలు, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతాయి. గుండెపోటు వస్తుంది. వీరిని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. వైద్యులు వెంటనే... పూడుకుపోయిన కొవ్వును తొలగించి.. రక్త ప్రసరణను పునరుద్ధరిస్తారు. ఎంత ఆలస్యమైతే ప్రమాద తీవ్రత అంత పెరుగుతుంటుంది.

గుండెకు రక్తాన్ని తీసుకువచ్చే నాళాలు చచ్చుబడిపోతే... వేరే ఇతర అవయవాలకు రక్త ప్రసరణ జరగదు. అందుకే శరీరంలో గుండె చాలా ప్రధానమైన అవయవం అని వైద్య నిపుణులు చెబుతారు. ఇకపోతే రక్తనాళాలు మూసుకుపోతే పక్కన వేరే నాళాలు వృద్ధి చెందుతాయి. వీటినే కొల్లేటరల్స్ అంటారు.

వీటివల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. సో ప్రమాదం కాస్త తక్కువే ఉంటుంది. అయితే ఇవి మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు వృద్ధి చెందవు. అందుకే తొలిసారి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోగి మరణించే పరిస్థితి కూడా తలెత్తే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి, మానసిక ఆందోళన వంటివి గుండెపోటుకు దారితీస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రాత్రి 10-11 మధ్యలో నిద్రపోయే వారిలో హార్ట్ ఎటాక్ అవకాశం తక్కువేనని చెబుతున్నారు. ఆలస్యంగా పడుకునే వారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతున్నారు. లేట్ గా నిద్రపోయే వారు... ఆలస్యంగా మేల్కొంటారు.. ఈ నేపథ్యంలో జీవ గడియారం దెబ్బతింటుందని అంటున్నారు.

అంతేకాకుండా సరిపడ నిద్ర పోనివారిలో ఈ ముప్పు తలెత్తే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మహిళల్లో ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.

ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండెపోటు రావడానికి 25 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. ఇకపోతే సాధ్యమైనంత వరకు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మాంసానికి బదులు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని అభిప్రాయపడ్డారు.