Begin typing your search above and press return to search.

దేశంలో మొదటి ఒమైక్రాన్ కేసు నమోదైనట్లేనా? ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   30 Nov 2021 5:33 AM GMT
దేశంలో మొదటి ఒమైక్రాన్ కేసు నమోదైనట్లేనా? ఎక్కడంటే?
X
కరోనా ఫ్యామిలీలో సరికొత్త వేరియంట్ ఒమైక్రాన్ మీద పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త వేరియంట్ ఇప్పటికే 12 దేశాలకు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని ప్రతి దేశంతో ఏదో ఒక లింకు ఉండే మన దేశానికి.. పొంచి ఉండే ముప్పు అంతా ఇంతా కాదు. తాజాగా వెలుగు చూసిన ఒమైక్రాన్ వేరియంట్ ఇప్పటివరకు భారత్ కు చేరుకోలేదన్న మాట కాసింత ప్రశాంతంగా ఉన్నప్పటికీ..తాజాగా కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటన ఇప్పుడు కొత్త భయానికి కారణమైంది.

సౌతాఫిక్రా నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ కావటం.. వారి నుంచి సేకరించిన నమూనాలో ఒకరిది డెల్టా వేరియంట్ కంటే భిన్నంగా ఉన్నట్లుగా మంత్రి కె. సుధాకర్ పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు అధికారికంగా ఏమీ చెప్పలేమని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. భారత వైద్య విధాన మండలితో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. గడిచిన తొమ్మిది నెలలుగా డెల్టా వేరియంట్ మాత్రమే ఉనికిలో ఉందని.. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిలో ఒకరి నమూనా భిన్నంగా ఉన్న విషయాన్ని ఆయన చెప్పారు.

భిన్నంగా ఉన్న నమూనా ఒమైక్రాన్ అని అంటున్నారని.. కానీ ఆ విషయాన్ని తాను అధికారికంగా చెప్పలేదన్నారు. బాధితుడికి సంబంధించిన వివరాల్ని తాము వెల్లడించలేమని చెప్పారు. అయితే.. సదరు బాధితుడి వయసు 63 ఏళ్లుగా వెల్లడించారు. తాను వారి వివరాల్ని వెల్లడించకూడదని.. వారి కొవిడ్ రిపోర్టు కాస్త భిన్నంగా ఉందని.. డెల్టా వేరియంట్ తో ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ అంశాన్ని ఐసీఎంఆర్ తో మాట్లాడుతున్నట్లుగా మంత్రి చెప్పారు. తాజాగా ఆయన మాటల్ని విన్న వారంతా ఒమైక్రాన్ భారత్ కు వచ్చేసినట్లేనని.. కర్ణాటకలో తొలి కేసు నమోదైనట్లుగా భావించక తప్పదంటున్నారు. అదే జరిగితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.