Begin typing your search above and press return to search.

ముందు ఈడీ.. తర్వాత మోదీ.. మొన్న మహారాష్ట్ర.. నిన్న జార్ఖండ్.. ఇప్పుడు బెంగాల్

By:  Tupaki Desk   |   23 July 2022 12:30 PM GMT
ముందు ఈడీ.. తర్వాత మోదీ.. మొన్న మహారాష్ట్ర.. నిన్న జార్ఖండ్.. ఇప్పుడు బెంగాల్
X
సహజంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో నిలబడి గెలుస్తుంది.. ఓడుతుంది.. విజయం సాధిస్తే అధికార పీఠం ఎక్కుతుంది.. ఓడినవారు ప్రతిపక్షానికిపరిమితం అవుతారు. అధికారంలోకి వచ్చిన వారు ఐదేళ్లు హవా సాగిస్తారు. ఇందులో ప్రలోభాలు, ప్రతిపక్షాల సభ్యులకు ఎర.. వారిని లాగేసుకోవడం, అవినీతి-అక్రమాలు, ప్రతిపక్షాల పోరాటాలు ఇలా ఎన్నో తతంగాలు ఉంటాయి. ఇవన్నీ ఓ స్థాయి వరకు సహజం. అవి లేకుంటే రాజకీయాల్లో మనగలగడం అసాధ్యం కూడా. ఇక కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎలాంటి అవినీతి, అక్రమాలు బయటకు రావు. కానీ, రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉంటే మాత్రం ఉప్పు-నిప్పే.. మరీ ప్రత్యేకంగా నరేంద్ర మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అయితే సెగలే.. అందులోనూ ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన, మమతా బెనర్జీ కెప్టెన్సీలోని టీఎంసీ తదితర రెబల్ పార్టీలున్న రాష్ట్రాలైతే
ప్రత్యేక టార్గెట్ గా మిగిలిపోతాయి. అలాంటిచోటకు ముందుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెళ్తుంది. తర్వాత మోదీ వెళ్తారు. అంటే స్థానిక సర్కాను కూలుస్తారు.

అక్కడ కూల్చారు.. మరిక్కడ.. మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లో శివసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. అయితే, 30 ఏళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన.. అనూహ్యంగా కాంగ్రెస్,ఎన్సీపీలతో జట్టుకట్టింది. ఇది బీజేపీకి మింగుడు పడని పరిణామంగా మారింది. దీనికితోడు బీజేపీపై, ప్రధాని మోదీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఒంటికాలి మీద విరుచుకుపడుతూ విమర్శలు చేసేవారు. దీనిని చూసి.. చూసి బీజేపీ ఒక్కసారిగా ఏక్ నాథ్ షిండే ను తెరమీదకు తెచ్చింది. అంతే.. మహారాష్ట్రలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ సర్కారు కుప్పకూలింది. అంతా 15 రోజుల్లో జరిగిపోయింది. ఏక్ నాథ్ షిండే సీఎం అయి కూర్చున్నారు. అయితే, దీనికిముందే.. బీజేపీ ఏమీ చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రయోగిస్తూనే ఉంది. ఈడీ.. మహా వికాస్ అఘాడీలోని మంత్రులు నవాబ్ మాలిక్ (ఎన్సీపీ), అనిల్ పరాబ్ (శివసేన)ల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసింది. అంతకుముందు బీఎంసీ చైర్మన్, సేన నేత యశ్వంత్ జాదవ్ సమన్లు అందుకున్నారు. రౌత్ కు సంబంధించిన రూ.11.5 కోట్ల ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. దీనికి తొలుత సేననేత ప్రతాప్ సరానాయక్ కు చెందిన రూ.11.35 కోట్ల ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ లిమిటెడ్ కేసులో ఈ మేరకు అటాచ్ చేసింది.

జార్ఖండ్ పైనా గురి..ఉత్తరాదిలో బీజేపీకి అవకాశం ఉండీ.. అధికారం దక్కని రాష్ట్రం జార్ఖండ్. దీనిని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. పైగా హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)బీజేపీకి దగ్గర కావడం లేదు. కాంగ్రెస్ తోనే కొనసాగుతోంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ.. దీనిని వశం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. అందుకేనే హేమంత్ కు సంబంధించిన పాత కేసులను తవ్వి తీస్తోంది. సరిగ్గా గత శుక్రవారం ఈడీ జార్ఖండ్ లోని ఏకంగా 17 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఇవన్నీ హేమంత్ కు ప్రధాన అనుచరుడైన, సాహిబ్ గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే పంకజ్ మిశ్రాతో సంబంధం ఉన్నవే. దీనర్థం టార్గెట్ జార్ఖండ్ అని స్పష్టమవుతోంది.

బెంగాల్ లో ఇది ట్రైలర్ మాత్రమే అంటున్న బీజేపీ బెంగాల్ లో ఈడీ దాడుల నేపథ్యంలో భాజపా రెండు ఫొటోలు షేర్‌ చేసి, తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ ఫొటోల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రి ఛటర్జీతో అర్పిత
దర్శనమిచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు చిత్రం ముందుందంటూ భాజపా నేత సువేందు అధికారి ఈ చిత్రాలను పోస్టు చేశారు. ఇదిలా ఉండగా.. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ మరుసటి రోజే ఈడీ దాడులు చేయడం వెనుక తమ నాయకులను వేధించాలన్నదే ఈడీ వ్యూహంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాగా, ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ్ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీని శనివారం ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్‌కతాలోని మంత్రి నివాసంలో అధికారులు 23 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో ఆయన సహకరించలేదని, దాంతో ఆయన్ను అరెస్టు చేశామని ఈడీ వెల్లడించింది. మంత్రి అనుచరురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో శుక్రవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమెను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం ఆయన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఈడీ అధికారులు మంత్రి, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్‌, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అర్పితా ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిందేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం కూడా అర్పిత నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

బీజేపీ జాబితాలో ఢిల్లీ కూడా.. శుక్రవారం ఢిల్లీలో మద్యం దుకాణాలకు సంబంధించిన అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్.. సీబీఐ విచారణకు ఆదేశించారు. అయితే, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఇంటిపై ఈడీ ఇప్పటికే దాడి చేసింది. ఇప్పుడు అనిల్ బైజాల్ ను ముందుపెట్టి సీబీఐని తెరపైకి తెచ్చింది. అంటే.. బీజేపీ జాబితాలో ఢిల్లీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నట్లు.. బీజేపీ అధికారంలోని మరో పెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడ సచిన్ పైలట్ ను అడ్డం పెట్టుకుని అధికారం పొందాలని చూసింది. అయితే, వీలు కాలేదు. చిత్రమేమంటే.. రెండేళ్ల కిందటే సీఎం అశోక్ గెహ్లోత్ నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఛత్తీస్ గఢ్ లోనూ ఇటీవల కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్ కు అత్యంత సన్నిహితుడైన డిప్యూటీ కార్యదర్శికి చెందిన ఏడు ప్రదేశాలపై ఆదాయ పన్ను అధికారులు దాడి చేశారు. ఏతావాతా చెప్పదేమంటే.. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మోదీ బీజేపీ వెళ్లలేని చోటకు.. ముందుగా ఈడీ వెళ్తుంది. తర్వాత సర్కార్లు వాటంతటవే కూలుతాయి.