Begin typing your search above and press return to search.

ఆఫ్గాన్ తొలి మహిళా ఎంపీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 2:41 AM GMT
ఆఫ్గాన్ తొలి మహిళా ఎంపీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా?
X
అగ్రరాజ్యం ఏం లెక్కలు వేసుకొని నిర్ణయం తీసుకుందో కానీ.. 20 ఏళ్ల కష్టాన్ని.. కొన్ని వందల మంది సైనికుల ప్రాణాల్ని.. లక్షల కోట్ల సంపదను ఖర్చు చేసి పునర్ నిర్మించిన ఆఫ్గాన్ ను చేజేతులారా పిశాచాల్లాంటి తాలిబన్లకు అప్పజెప్పిన వైనం చూస్తే అయ్యో అనకుండా ఉండలేం. ఒకప్పుడు తాలిబన్ల ఏలుబడిలో దారుణాలు చూసిన వారు.. తర్వాతి నాటో దళాల అండతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంతో తమ భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలు కన్నారు.

అలాంటి వారి కలలు కల్లలు అయిపోతూ తాలిబన్లు చెలరేగిపోతున్నారు. మానవ హననానికి పాల్పడుతున్నారు. దారుణాల మీద దారుణాలు చేస్తూ ఆఫ్గాన్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకే.. ఏ మాత్రంఅవకాశం ఉన్నా.. సొంత దేశాన్ని వదిలేసి వివిధ దేశాలకు వెళ్లిపోతున్నారు. అలా దేశాన్ని విడిచి పెట్టిన మహిళల్లో ఒకరు.. అనార్కలీ కౌర్‌ హోనర్‌యార్‌. ఈమె అలాంటి ఇలాంటి ఆమె కాదు. ప్రొఫెషన్ ప్రకారం ఆమె దంత వైద్యురాలు. ప్రజల బతుకుల్ని మార్చేందుకు రాజకీయ రంగంలోకి వచ్చారు.

36 ఏళ్ల ఈ ముస్లిమేతర మహిళ.. ఆప్గాన్ ఎన్నికల్లో నిలబడటమే కాదు.. విజయం సాధించారు కూడా. అయితే.. ఎప్పుడైతే తాలిబన్లు ఆఫ్గాన్ ను ఆక్రమించేశారో.. అప్పటి నుంచి వారి నుంచి తప్పించుకుంటూ ఎవరికి వారుగా విదేశాలకు పయనమవుతున్నాయి. అలానే అనార్కలీ కౌర్‌ హోనర్‌యార్‌ కూడా భారత్ కు వచ్చేశారు. ఆఫ్గాన్ దేశంలో తొలి ముస్లిమేతర మహిళా ఎంపీగా గుర్తింపు పొందిన ఆమె.. పొట్ట చేతబట్టుకొని ప్రాణభయంతో భారత్ కు వచ్చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె.. ఒక హోటల్ లో బస చేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆఫ్గాన్ లో ప్రజాస్వామిక.. అభ్యుదయం జీవితం గడిపే రోజులు వస్తాయని తాను ఎంతో ఆశపడ్డానని.. కానీ తన కలలు కల్లలైపోయాయన్నారు. దేశం విడిచి పెట్టే రోజు వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్న ఆమె.. ‘మాతృభూమిని విడిచి పెట్టి వస్తున్న వేళ.. గుప్పెడంత మట్టిని కూడా నా వెంట తెచ్చుకోలేకపోయాను’ అంటూ ఆమె తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. తరచి చూస్తే.. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంతకంటే ఘోరమైన నరకం మరొకటి ఉండదేమో కదా?