Begin typing your search above and press return to search.

రావులపాలెంలో కాల్పులు.. అన్నింటికి మించి షాకింగ్ ఏమంటే?

By:  Tupaki Desk   |   5 Sept 2022 10:05 AM IST
రావులపాలెంలో కాల్పులు.. అన్నింటికి మించి షాకింగ్ ఏమంటే?
X
ప్రశాంతంగా ఉండే కోనసీమలో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఉన్న ఈ ఉదంతం ఆందోళనకు గురయ్యేలా ఉండటమే కాదు.. కొత్త చర్చను తెర మీదకు తీసుకొచ్చింది.

వ్యాపారి మీద గుర్తు తెలియని ఆగంతకులు దాడి చేయటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంగా నాటుతుపాకీతో కాల్పులు జరపటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదివారం రాత్రి వేళ చోటు చేసుకున్న ఈ వైనంలో అసలేం జరిగిందంటే.

కోనసీమలోని రావులపాలానికి చెందిన సత్యానారాయణ రెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. ఆదివారం రాత్రి వేళ అతడిపైన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆయన కొడుకు ఆదిత్యరెడ్డి దుండగుల దాడిని ప్రతిఘటించారు.

అనూహ్యంగా చోటు చేసుకున్న దాడితో దుండగులు ఒక్కసారిగా పిస్టల్ తీసి గాల్లోకి కాల్పులు జరిపారు.ఇదే సమయంలో బాధితులు పెద్ద ఎత్తున కేకలు వేయటంతో.. చుట్టుపక్కల వారు అప్రమత్తం అవుతారన్న సందేహంతో సదరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ క్రమంలో సదరు ఆగంతకులకు చెందిన ఒక సంచి అక్కడ పొరపాటున కింద పడిపోయింది. వారు వెళ్లిన తర్వాత సదరు సంచిలో ఏమున్నాయో చూసిన వారు మరింత ఉలికిపాటుకు గురయ్యారు.
సదరు సంచిలో రెండు నాటు బాంబులతో పాటు జామర్ కూడా ఉంది.

వెంటనే అప్రమత్తమైన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి.. కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారు ఎవరై ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.