Begin typing your search above and press return to search.

ఐసోలేషన్ కు ఫైర్ బ్రాండ్ సీఎం.. కారణం ఏమంటే?

By:  Tupaki Desk   |   14 April 2021 7:30 AM GMT
ఐసోలేషన్ కు ఫైర్ బ్రాండ్ సీఎం.. కారణం ఏమంటే?
X
సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు.. ప్రముఖుల నుంచి ఎలాంటి ప్రాధాన్యత లేని వారి వరకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా.. ఎవరు తనకు దగ్గరగా వస్తే వారిని పట్టేసే కరోనా మహమ్మారి పుణ్యమా అని కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 1.6లక్షలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదువుతున్న రెండో దేశంగా భారత్ నిలిచింది.

కరోనా మొదటి దశ విషయంలో కేంద్రం కఠినంగా ఉండటం.. ఆర్థిక కంటే కూడా దేశ ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమన్న మాటను చెప్పి.. లాక్ డౌన్ ను విధించటం తెలిసిందే. ఈ కారణంగా కేసుల్ని అదుపు చేయటానికి వీలు కలిగిందని కేంద్రంలోని మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. మొదటి దశ విషయంలో అంత అప్రమత్తంగా ఉన్న కేంద్రం.. తాజాగా విరుచుకుపడుతున్న సెకండ్ వేవ్ విషయంలో చూసిచూడనట్లుగా ఎందుకు ఉందన్నది ప్రశ్న.

అలా అని లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదు కానీ.. కోవిడ్ నిబంధనల్ని పక్కాగా ఫాలో అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటే.. ఇప్పుడు నమోదయ్యే కేసుల్లో సగం తగ్గిపోయి ఉండేవి. కానీ.. అలాంటిదేమీ లేకపోవటం వల్ల కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి తోడు.. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగటం.. ఇది సరిపోనట్లుగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు.. స్థానిక ఎన్నికల కారణంగా కేసుల వ్యాప్తి మరింత పెరుగుతోంది.

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లటం దేనికి నిదర్శనం. తాజాగా ఆయన ఐసోలేషన్ కు వెళ్లారు. తనతో ఉండే అధికారుల్లో పలువురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో.. ఆయన హుటాహుటిన ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను సీఎం యోగి చేశారు.

తన కార్యాలయంలో పని చేసే సిబ్బంది కరోనా పాజిటివ్ కావటంతో.. తాను ముందు జాగ్రత్తల్లో భాగంగా ఐసోలేషన్ కు వెళ్లాలనని..తనతో సన్నిహితంగా ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే.. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అందుకు భిన్నంగా నిప్పు వరకు వెళ్లటం.. సెగ తగిలిందని అయింట్ మెంట్ రాసుకోవటం బాగానే ఉన్నా..కొన్నిసార్లు చర్మం కాలిపోయే ప్రమాదం ఉంటుందన్నది గుర్తిస్తే మంచిది.