Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ ఫ్యాక్టరీకి ఏమైంది?

By:  Tupaki Desk   |   31 Jan 2023 10:24 AM GMT
టీడీపీ ఎంపీ ఫ్యాక్టరీకి ఏమైంది?
X
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కు చెందిన అమరరాజా బ్యాటరీస్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు మోర్ధానపల్లిలో అమరరాజా గ్రోత్‌ కారిడార్‌ లో జనవరి 30 రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముందుగా ట్యూబులర్‌ బ్యాటరీ తయారీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు ప్లాంట్‌ మొత్తం వ్యాపించాయి.

పరిశ్రమలోని టీబీడీ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో దాదాపు 250 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.

ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్దలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి వరకు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు.

కాగా అగ్నిప్రమాదం రాత్రి భోజన విరామంలో జరిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో సిబ్బంది అంతా క్యాంటీన్‌ లో ఉండటంతో సిబ్బంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెబుతున్నారు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై పోలీసు అధికారులు, అగ్నిమాపక అధికారులు విచారణ జరుపుతున్నారు.

కాగా ప్రమాద ఘటనతో కార్మికులందరినీ యాజమాన్యం పరిశ్రమ నుంచి సురక్షితంగా బయటకు పంపారు. ప్రాణనష్టం సంభవించలేదని యాజమాన్యం తెలిపింది. కొద్దిమందికి మాత్రం స్వల్ప గాయాలయ్యానని వెల్లడించింది. మరోవైపు అగ్నిప్రమాదంలో వల్ల ఏర్పడ్డ ఆస్తి నష్టం పై అమరరాజా అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా అమరరాజా బ్యాటరీస్‌ కు చిత్తూరు జిల్లాలో ప్రధాన ప్లాంట్‌ ఉంది. అలాగే ఇటీవల రూ.7 వేల కోట్ల భారీ పెట్టుబడితో తెలంగాణలో మరో యూనిట్‌ ఏర్పాటుకు సిద్ధమైంది. వాస్తవానికి ఆ ప్లాంటును కూడా ఏపీలోనే నెలకొల్పాలనుకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టడం వల్లే అమరరాజా తెలంగాణకు తరలిపోయిందనే విమర్శలు వచ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.