Begin typing your search above and press return to search.

పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు అవసరమా ఫైర్ బ్రాండ్?

By:  Tupaki Desk   |   22 Dec 2021 1:12 AM GMT
పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు అవసరమా ఫైర్ బ్రాండ్?
X
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నంతనే సరిపోదు. సమయం.. సందర్భం చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ఏపీ అధికారపక్ష ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యేగా సైతం సొంత పార్టీ నేతల నుంచి తెగ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఆర్కే రోజా.. మరోసారి చంద్రబాబుపై సీరియస్ అయ్యారు. విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు చేయటానికి.. ఒంటికాలి మీద విరుచుకుపడే విషయంలో ఉత్సాహాన్ని ప్రదర్శించే ఆర్కే రోజా.. ఎప్పటిలానే జరిగిపోయిన విషయాల్ని.. అరిగిపోయిన అంశాల్ని ప్రస్తావించి తన ఆక్రోశాన్ని కక్కేశారు.

ఏదైనా విషయం ఒకట్రెండుసార్లు చెబితే ఓకే. కానీ అదే పనిగా మాట్లాడితే విన్నదే విని..విని బోరు కొట్టటం ఖాయం. ఇప్పుడు రోజా మాటలు కూడా అదే తీరులో ఉన్నాయి. చంద్రబాబు ఎపిసోడ్ లో ఆమె మాటల్లో వాస్తవం ఎంతన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.

అయినప్పటికీ తగ్గకుండా నోటికి వచ్చినట్లుగా తిట్టేయటంలో ఆమెకు తర్వాతే ఎవరైనా.
తాజాగా చంద్రబాబు మీదా.. ఆయన సతీమణి మీదా మాట్లాడటం ద్వారా మీడియా అటెన్షన్ తన మీద ఉండేలా జాగ్ర్తలు తీసుకోవటం బాగానే ఉన్నా..కొత్త విషయాలేమీ లేకపోవటం ఒక లోపంగా చెప్పాలి.

చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పి.. పాత చింతకాయ పచ్చడిని తలపించేలా ఆర్కే రోజా మాటలు ఉన్నట్లుగా చెప్పాలి. అసెంబ్లీలో జరగని విషయాన్ని జరిగినట్లుగా ఏడ్చి .. నానా యాగీ చేశారంటే ఎవరో ఏదో స్కెచ్ వేసినట్లుగా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అందుకే.. జాగ్రత్తగా ఉండాలన్నారు.

డవారిపై అనవసరంగా ఎవరు నోరు పారేసుకుంటారో, ఎవరు కుట్రలు చేసి తొక్కేయాలని చూస్తారో వారి పాపాన వారే పోతారు.. అంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆర్కే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఎంతోమంది మహిళల జీవితాలు నాశనమయ్యాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి భువనేశ్వరికి ఆమె భర్త చంద్రబాబు వల్లే అపాయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మార్వో వనజాక్షి.. రితేశ్వరి లాంటి వారి ఉదంతాల వేళ భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. గోదావరి పుష్కరాల పేరుతో 30 మందిని చంపేసినప్పుడు వారి కుటుంబాల కన్నీరు కనిపించలేదా? అంటూ మాట్లాడిన రోజా మాటలకు.. ఇటీవల భారీ వర్షాలు.. వరదల నేపథ్యంలో కొట్టుకుపోయిన వారి సంగతేమిటి? రోజా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రాజకీయంగా చంద్రబాబును తిట్టాలనుకొని తిట్టేయటం తప్పేం కాదు.కానీ.. ఇప్పటికే జరిగిపోయి.. అలాంటి తప్పుల కారణంగా అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న వేళ.. ఆ అంశాలన్నింటికి ఇప్పుడు ప్రస్తావించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని రోజా ఎందుకు మిస్ అవుతున్నట్లు? జరిగిన తప్పులకు శిక్ష పడిన తర్వాత కూడా.. అదే పనిగా ఆ విషయాల్నే ప్రస్తావించటం వల్ల ఎలాంటి రాజకీయ మైలేజీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత చింతకాయ పచ్చడి అయిన కాస్త ఫర్లేదు.. ఇప్పటికే కాలం చెల్లిన ఉదంతాల గురించి మాట్లాడటం ద్వారా నష్టపోతున్నది ఆర్కే రోజానే అన్న మాట వినిపిస్తోంది.