Begin typing your search above and press return to search.

మోడీ కాళ్లు పట్టుకోవటానికైనా సిద్ధమన్న ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   30 May 2021 6:30 AM GMT
మోడీ కాళ్లు పట్టుకోవటానికైనా సిద్ధమన్న ఫైర్ బ్రాండ్
X
ఎన్నికల వేళలోనే రాజకీయం.. ఆ తర్వాత అంతా ప్రజా సంక్షేమం మీదనే ఫోకస్ అంటూ తరచూ చెప్పే మాటలకు జరుగుతున్న పరిణామాలకు ఏ మాత్రం పొంతన లేని పరిస్థితి ఇటీవల కాలంలో నెలకొంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారా? అన్న సందేహాం కలిగేలా తాజాగా ఆమె మాటలు ఉన్నాయి. తాను చేయాల్సినవన్నీ చేస్తూనే.. సుద్దులు చెప్పే ప్రధాని మోడీకి.. ఆయనకు అర్థమయ్యే భాషలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారా? అన్న సందేహాలు కలిగేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో జరిగిన యాస్ తుపాను నష్టంపై రివ్యూ నిర్వహించిన ప్రధాని మోడీని అరగంట పాటు సీఎం మమత వెయిట్ చేయించేలా చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావటం తెలిసిందే. రివ్యూలో ప్రధాని.. ఒకవైపున అందరూ ఉండగా.. బెంగాల్ సీఎం ఉండాల్సిన వరుస మాత్రం ఖాళీగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఉదంతం పెను దుమారంగా మారింది. దీంతో.. ఈ ఉదంతంపై వివరణకు ప్రెస్ మీట్ పెట్టారు దీదీ.

తాను ప్రధానితో రివ్యూ సమావేశానికి ఆలస్యంగా వెళ్లానని చెప్పటం పూర్తిగా అబద్ధమని.. ఆ మాటకు వస్తే తానే 20 నిమిషాల ముందు వెళ్లినట్లుగా ఆమె చెప్పారు. కేంద్రం తనను ఉద్దేశపూర్వకంగా అవమానించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రధానితో తన మీటింగ్ ఉన్న ప్రాంతానికి వెళితే.. అక్కడ సెక్యూరిటీ తమను అడ్డుకున్నారని చెప్పారు. వేరే వారి ద్వారా కాన్ఫరెన్సు హాల్ లో సమావేశం ఉందని తెలుసుకున్నామన్నారు.

అక్కడికి వెళ్లేసరికి అప్పటికే ప్రధాని సమావేశాన్ని ప్రారంభించారు. గవర్నర్ తో పాటు కొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కనిపించారు. ఇది పూర్తిగా ప్రోటోకాల్ కు విరుద్ధం. ప్రధాని - ముఖ్యమంత్రి నిర్వహించే మీటింగ్ లో ప్రతిపక్షాలకు పనేమిటి? అని ప్రశ్నించారు. ఇదే తీరును ఒడిశా.. జార్ఖండ్.. గుజరాత్ లలో కూడా ఇలానే విపక్షాల్ని ఆహ్వానించారా? ఇది పూర్తిగా రాష్ట్రాన్ని అవమానించటమేనని మండిపడ్డారు.

తాను ప్రధాని మోడీ కాళ్లు పట్టుకోవటానికైనా సిద్ధమని మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలకు న్యాయం చేసేందుకు తాను ఏమైనా చేస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేయనంటూనే రాజకీయాలు చేసే ప్రధాని మోడీ తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. మమత మెలోడ్రామా పండించారన్న మాట వినిపిస్తోంది. మమత తాజాగా ఇచ్చిన కౌంటర్ కు.. కేంద్రం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.