Begin typing your search above and press return to search.

శ్రీశైలం దుర్ఘటన: మనసుల్ని మెలిపెడుతున్న వారిద్దరి ఆఖరి మాటలు

By:  Tupaki Desk   |   24 Aug 2020 9:00 AM IST
శ్రీశైలం దుర్ఘటన: మనసుల్ని మెలిపెడుతున్న వారిద్దరి ఆఖరి మాటలు
X
దారుణమైన దుర్ఘటన చోటు చేసుకొని.. చావు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఎలా స్పందిస్తారు? వారి మధ్య ఎలాంటి సంభాషణ సాగుతుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపే వీడియో ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. విన్నంతనే మనసుల్ని మెలిపెట్టేలా చేస్తున్న శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి.

ఈ దారుణ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది జెన్ కో సిబ్బంది కాగా మరొకరు ప్రైవేటు సంస్థకు చెందిన వారు కావటం తెలిసిందే. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వేళ.. ఘటనలో మరణించిన ఏఈలు సుందర్.. మోహన్ ల సంభాషణలు తాజాగా బయటకు వచ్చాయి. చుట్టూ దట్టమైన పొగ అలుముకొని.. ముందుకు ఎలా వెళ్లాలన్న విషయం తెలీని వేళలో.. అక్కడ జరిగిన దారుణ దుర్ఘటన కు సంబంధించిన పరిస్థితిని షూట్ చేశారు. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్ తో పాటు.. వారి మాటలు కొన్ని బయట కు వచ్చాయి.

ప్రమాదం జరిగి.. ప్రాణాలు పోయే పరిస్థితుల్లోనూ మోహన్.. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను షూట్ చేశారు. ప్రమాదస్థలితో మోహన్ సెల్ ఫోన్ ను ఆయన సతీమణికి అందజేశారు. దాన్ని ఛార్జింగ్ పెట్టిన ఆమె.. ప్రమాదానికి సంబంధించిన వీడియోను.. అందులోని మాటల్ని విని కన్నీరు మున్నీరు అయ్యారు. మరణించే సమయంలోనూ ధైర్యం కోల్పోకుండా.. జరిగిన ఉదంతాన్ని చిత్రీకరించిన ధైర్యసాహాసాల్ని పలువురు అభినందిస్తున్నారు.
చుట్టూ మంటలు.. పొగ అలుముకున్న వేళ.. ప్రాణాలు పోవటానికి కాస్త ముందుగా ఈ ఇద్దరు ఏఈలు మాట్లాడుకున్న మాటలు.. వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. అందులో ఏముందంటే..

సుందర్: ఇక కష్టం.. మన పని అయిపోయింది.. ఆశలు వదులుకో
మోహన్: లేదు.. ఆశగా ఉండాలె.. కొద్ది సేపు ఆలోచించుకుని పోదాం.
సుందర్: ఆలోచించే సమయం లేదు.. ఇక మనం బతకం.. పొగ మొత్తం అలుముకుంది
తాజాగా లభించిన వీడియో ఫుటేజ్ లో ఇద్దరు ఏఈల ఆఖరి సంభాషణ రికార్డు అయ్యింది.ఇదంతా చూసినప్పుడు.. ప్రమాదం నుంచి బయట పడేందుకు ఇద్దరు ఏఈలో ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పక తప్పదు. అంతే కాదు.. ప్రమాదం జరిగిన సమయం లో సుందర్ తన భార్య కు ఫోన్ చేసిన సంభాషణ కూడా వెలుగు చూసింది. నువ్వు.. పిల్లలు జాగ్రత్త.. పదిహేను నిమిషాల్లో కాపాడ లేకపోతే బతికే పరిస్థితి లేదని చివరి సారిగా సుందర్ తన కుటుంబ సభ్యుల తో మాట్లాడిన వైనం మనసున్న ప్రతి ఒక్కరిని మెలి పెట్టేస్తుంది.