Begin typing your search above and press return to search.

కేరళ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్..ఏం ఫైళ్లు తగలబడ్డాయో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Aug 2020 10:45 AM IST
కేరళ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్..ఏం ఫైళ్లు తగలబడ్డాయో తెలుసా?
X
కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు తగలబడిపోయినట్లు చెబుతున్నారు. ఆగ్నికి ఆహుతైన ఫైళ్లలో.. కొద్ది నెలలుగా పినరయి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గోల్డ్ స్కాంకు సంబంధించిన ఫైళ్లు కూడా ఉండటం గమనార్హం. గోల్డ్ స్కాం నేపథ్యంలో పినరయి సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కోవటం.. అందులో నెగ్గిన 24 గంటల వ్యవధిలో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ.. కీలక ఫైళ్లు మాత్రం తగలబడిపోయినట్లు చెబుతున్నారు. సెక్రటేరియట్ లోని రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు రావటంతో అక్కడి సిబ్బంది అలెర్టు అయ్యారు. మంటల్ని అదుపు చేస్తూనే.. మంటల్లో చిక్కుకోకుండా కొన్ని పత్రాల్ని బయటకు తీశారు. కానీ.. అప్పటికే పలు ఫైళ్లు తగలబడినట్లుగా గుర్తించారు.

ఈ అగ్నిప్రాదం ఎందుకు జరిగిందన్న విషయంపై స్పష్టత రాలేదు. అన్ని అగ్నిప్రమాదాల మాదిరే విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణంగానే చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది. గోల్డ్ స్కాం అంశం ప్రస్తుతం ముఖ్యమంత్రి పినరయి కార్యాలయంలో ఉన్నట్లు చెబుతున్నారు. అగ్నిప్రమాదంలో కీలక ఫైళ్లు తగలబడిపోయిన నేపథ్యంలో.. ఈ ఉదంతంపై విచారణ ఎలా ముందుకుపడుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.