Begin typing your search above and press return to search.

పుతిన్ కు ఫిన్లాండ్, స్వీడన్ షాక్

By:  Tupaki Desk   |   17 May 2022 3:00 AM GMT
పుతిన్ కు ఫిన్లాండ్, స్వీడన్ షాక్
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు పెద్ద షాకిచ్చాయి. నాటో కూటమిలో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)లో సభ్యత్వం తీసుకునే విషయంలో వివాదం పెరిగి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. నాటో సభ్యత్వం తీసుకోవటం వల్ల తమకేమీ ఇబ్బందులు లేవని అయితే విస్తరణ, సైనికపరంగా తీసుకునే చర్యలనే రష్యా అనుమతించదని పుతిన్ ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు.

అయితే పుతిన్ హెచ్చరికలను ఉక్రెయిన్ లెక్కచేయలేదు. భూభాగం విస్తరణకు ఎలాంటి ప్రయత్నాలు జరగకపోయినా సైనికంగా బలోపేతం అయ్యేందుకు, అమెరికా, బ్రిటన్ దేశాలతో ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా ఒప్పందాలు చేసుకుంది.

దాంతో అమెరికా సైన్యాధికారులు ఉక్రెయిన్లో దిగారు. దీంతో రష్యాలో అభద్రత మొదలైంది. తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగానే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. దాంతో నాటో దేశాల సభ్యత్వం తీసుకోవటం అనేది అనుమానంగా మారింది.

ఇలాంటి నేపధ్యంలోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటి విషయంలో పుతిన్ మండిపడుతున్నారు. సభ్యత్వం తీసుకోవటం వరకే అయితే తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఉక్రెయిన్ కు చెప్పినట్లుగానే పై రెండు దేశాలను కూడా హెచ్చరించారు. అయితే వీటికి కూడా అమెరికా, బ్రిటన్ మద్దతున్న కారణంగా పుతిన్ను లెక్కచేయటంలేదు.

స్వీడన్, ఫిన్లాండ్ కూడా ఉక్రెయిన్ లాగే రష్యాతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. నిజానికి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగటంలో అమెరికాయే ప్రధాన కారణమని చెప్పాలి. ఎందుకంటే ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాకు వ్యతిరేకంగా అమెరికా సైనిక కార్యకలాపాలు మొదలుపెట్టింది.

ఏదో రూపంలో రష్యాను దెబ్బకొట్టాలని అమెరికా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఉక్రెయిన్ లో అమెరికా కార్యకలాపాలు మొదలు పెట్టిందో వెంటనే ఉక్రెయిన్ను రష్యా హెచ్చరించింది. అయినా ఉక్రెయిన్ పట్టించుకోకపోవటంతో దాడులు చేస్తోంది. రేపు ఇదే పరిస్ధితి ఫిన్లాండ్, స్వీడన్ కు కూడా తప్పదని పుతిన్ హెచ్చరించారు. మరీ దేశాలు ఏమి చేస్తాయో చూడాలి.