Begin typing your search above and press return to search.

దేశ ప్రజలకు మోడీ సవాల్ విసిరారు

By:  Tupaki Desk   |   23 Feb 2016 4:17 AM GMT
దేశ ప్రజలకు మోడీ సవాల్ విసిరారు
X
ఇప్పటివరకూ ప్రధాని పదవిని చాలామందే చేపట్టినా.. మిగిలిన వారెవరిలోనూ లేని ఒక విలక్షణత ప్రధాని నరేంద్రమోడీలో కనిపిస్తుంది. చేతల సంగతి ఎలా ఉన్నా మాటల విషయంలో మాత్రం ఆయనకు మించిన మొనగాడు మరెవరూ ఉండరనే చెప్పాలి. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పటం.. భావోద్వేగాల్ని రగిలించటం.. సరికొత్త అంశాల్ని ప్రస్తావించటం.. స్ఫూర్తివంతంగా మాట్లాడటం.. రాజకీయ ప్రత్యర్థుల్ని సైతం తన మాటలతో కట్టిపడేసేలా చేయటం ఆయనకు మాత్రమే సొంతం.

ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మాట్లాడాలో మోడీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ఒడిశాలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ.. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న ఎన్జీవోలను డబ్బు లెక్క అడగటంతో.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా యూపీలోని వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 100వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ధేశ ప్రజలకు ఆయనో సవాలు విసిరారు. తాను ప్రస్తావించిన సమస్యకు పరిష్కారం ఎవరైనా వెతుకుతారా? అంటూ ప్రశ్నించారు.

తాజాగా దేశ ప్రజలకు మోడీ విసిరిన సవాల్ ఏమిటంటే.. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని తగ్గించే విషయంలో ప్రపంచానికి సహకరించేందుకు సరికొత్త ఆలోచనలతో రావాలని.. ప్రత్యామ్నాయ ఇంధనవనరుల్ని కనుగొనాలంటూ కోరారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు.. ఇంధన సంక్షోభం.. ప్రాణాంతాక వ్యాధులకు పరిష్కారాలు కనుగొనాలని కోరారు. కట్.. పేస్ట్ పీహెచ్ డీల కంటే కూడా కొత్త పరిశోధన జరగాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతిని దోచుకోవటాన్ని భారతీయులు నేరంగా విశ్వసిస్తారని.. మొక్కల్లో భగవంతుడ్ని.. నదిలో మాతృమూర్తిని చూసే దేశ పౌరులు.. పెరుగుతున్న భూతాపానికి బ్రేక్ లు వేసేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలంటూ సవాల్ విసిరారు. మరి.. మోడీ సవాల్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.