Begin typing your search above and press return to search.

ఏపీ న్యాయ రాజధాని ఏర్పాటు చేయబోయేది అక్కడే .. స్పష్టం చేసిన ఆర్ధికమంత్రి బుగ్గన !

By:  Tupaki Desk   |   9 March 2021 6:30 AM GMT
ఏపీ న్యాయ రాజధాని ఏర్పాటు చేయబోయేది అక్కడే .. స్పష్టం చేసిన ఆర్ధికమంత్రి బుగ్గన !
X
ఏపీలోమూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంతర్గతంగా చకచకా సాగిపోతున్నాయి. రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నా .. మరోవైపు మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వం అంతర్గతంగా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకారం కర్నూలు జిల్లాలో న్యాయ రాజధాని ఏర్పాటు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ మేరకు అసెంబ్లీ, గవర్నర్‌ ఆమోదం పొందిన చట్టాలను కొందరు హైకోర్టులో సవాల్‌ చేయడంతో ఆ ప్రక్రియ పెండింగ్‌ లో ఉంది. కోర్టు తీర్పు తర్వాత న్యాయరాజధాని ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటి నుంచే చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాజధానిగా ఉన్న అమరావతిని చట్ట సభల రాజధానిగా మారుస్తున్న నేపథ్యంలో కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖకు తరలింపుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షాతో భేటీల్లో సీఎం జగన్ ఇప్పటికే న్యాయరాజధానిని నోటిఫై చేయాలని కోరారు. దీంతో ప్రస్తుత ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌ తో మాట్లాడి ఈ వ్యవహారాన్ని తేల్చాల్సి ఉంది. కర్నూల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం స్ధానికంగా ఉన్న జగన్నాథగట్టులో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం హైకోర్టును రీనోటిపికేషన్ చేసి, సీజే ఆమోదం కూడా తెలిపాక జగన్నాథ గట్టులో రాజధాని ఏర్పాటుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటనకు వచ్చిన ఆయన హైకోర్టు జగన్నాధగట్టులో ఏర్పాటవుతుందని చెప్పారు.

కర్నూల్లో న్యాయరాజధాని ఏర్పాటు కోసం జగన్నాధగట్టు ప్రాంతాన్ని ఎంపిక చేసిన ప్రభుత్వం, మొత్తం 250 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇందులోనే హైకోర్టు భవనంతో పాటు జడ్జిల క్వార్టర్స్‌, ఇతర నిర్మాణాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇది శాశ్వత హైకోర్టు కాబట్టి ఆ మేరకు భారీ నిర్మాణాలు, క్వార్టర్లు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సర్వే చేసి ఎంపిక చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూల్లో ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసింది. పార్లమెంటులో దీనిపై న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌తో ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఈ ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని సూచించారు. దీనికి ఎలాంటి గడువూ పెట్టుకోలేదని తెలిపారు. అయితే హైకోర్టులో ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారంపై కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో ఆ కేసు ఓ కొలిక్కి వస్తే కానీ ఈ న్యాయ రాజధాని ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చు.