Begin typing your search above and press return to search.

ఇక.. బిగ్ ఫైట్ ట్రంప్.. హిల్లరీల మధ్యనే

By:  Tupaki Desk   |   7 Jun 2016 6:56 AM GMT
ఇక.. బిగ్ ఫైట్ ట్రంప్.. హిల్లరీల మధ్యనే
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది బరిలో నిలవాలనుకుంటే మొదట్లో ప్రైమరీ ఎన్నికల్లో అధిక్యతలో నిలవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా సొంత పార్టీ నేతల నుంచే పోటీని ఎదుర్కొనాల్సి ఉంటుంది. తొలుత సొంత పార్టీ నేతల మీద విజయం సాధించిన తర్వాత.. ప్రత్యర్థి పార్టీతో ముఖాముఖిన ఢీ.. అంటే ఢీ అనే పరిస్థితి.

అమెరికా ఎన్నికల్లో అధికార డెమొక్రాట్ల తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ తో పాటు పలువురు పోటీ పడగా తుది పోరుకు మాత్రం హిల్లరీ అభ్యర్థిత్వం తాజాగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక.. రిపబ్లికన్ల తరఫున ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసుకున్న నేపథ్యంలో తుది పోరు హిల్లరీ.. ట్రంప్ ల మధ్యనే సాగనుంది. నిజానికి వీరిద్దరి మధ్యనే తుది పోరు నడుస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక మహిళ బరిలో నిలవటం చరిత్రలో ఇదే తొలిసారి కావటం. తాజాగా ప్యర్టోరికోలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ భారీ విజయంసాధించిన నేపథ్యంలో తుది పోరు ట్రంప్.. హిల్లరీ మధ్యనే జరుగుతుందని అందరూ భావిస్తుంటే.. అధ్యక్ష ఎన్నికల రేసులో హిల్లరీతో పోటీ పడిన మరో డెమొక్రాట్ శాండర్స్ మాత్రం జులై వరకూ వెయిట్ చేయాలని.. అప్పుడే తుది పోరుకు ఎవరు వెళతారన్నది తేలుతుందంటూ చెబుతుననారు. అయితే.. అధ్యక్ష స్థానానికి అవసరమైన 2383 డెలిగేట్లను హిల్లరీ సాధించిన నేపథ్యంలో శాండర్స్ వ్యాఖ్యలు రాజకీయమైనవి తప్పించి.. మరెలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తుది పోరు బరిలో నిలిచేందుకు హిల్లరీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైన సంతోషంలో ఉన్న ఆమెకు అనుకోని ఎదురుదెబ్బ తగిలిందన్న మాట వినిపిస్తోంది. ఆమె దగ్గర బంధువు రోగర్ క్లింటన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో పోలీసులు ఆతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ క్లింటన్ కు సోదరుడు అయ్యే రోగర్.. గతంలోనూ డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. మీడియాలో వస్తున్నట్లుగా రోగర్.. బిల్ క్లింటన్ కు బంధువు అవుతారా? అన్న విషయంపై పోలీసులు మాత్రం పెదవి విప్పటం లేదు.