Begin typing your search above and press return to search.

విమానం గాల్లోకి ఎగరాక కొట్టుకున్న పైలెట్లు.. ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   29 Aug 2022 3:40 PM GMT
విమానం గాల్లోకి ఎగరాక కొట్టుకున్న పైలెట్లు.. ఏం చేశారంటే?
X
కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానం భద్రత అంతా పైలెట్ల చేతుల్లో ఉంటుంది. అందుకే వారు అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా వందల మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. విమానం నడిపే పైలట్లు ఎంతో నేర్పుతో, ఓర్పుతో, నైపుణ్యవంతులై ఉంటారు. సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. అలాంటిది వారే విమానంలో కాక్ పిట్ లో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్ చల్ చేసి ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు.ఫ్రాన్స్ లో జరిగిన ఈ పైలెట్ల గుద్దులాట వైరల్ అయ్యింది.

పారిస్ నుంచి జెనీవాకు వెళుతున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలోని ఇద్దరు పైలట్లు గొడవకు దిగిన కారణంగా వారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విమానం కాక్ పిట్ లో గొడవ పడినట్లు ఎయిల్ లైన్స్ అధికారులు ధ్రువీకరించారు. కొద్ది క్షణాల్లో గొడవ సద్దుమణిగిందని.. ఆ తర్వాత విమాన ప్రయాణం సాఫీగా సాగిందని తెలిపారు.

విమానం వేల అడుగుల ఎత్తులో గాల్లో ఉండగానే విమానం కాక్ పిట్ లో పైలట్ లిద్దరూ గొడవకు దిగారు. తన పట్ల విధేయత చూపాలని పైలట్ తన కోపైలట్ తో చర్చిస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కాలర్స్ పట్టుకొని కొట్టుకోవడం మొదలుపెట్టడంతో విమాన సిబ్బంది లోపలికి పరిగెత్తుకొని వెళ్లి ఇద్దరినీ అదుపు చేశారు.

క్యాబిన్ సిబ్బందిలో ఒకరు ఇద్దరు పైలట్ల మధ్య నిలబడి గొడవ ఆపడానికి సహాయం చేశారు. దీని తర్వాత క్యాబిన్ సిబ్బంది మిగిలిన ప్రయాణమంతా కాక్ పిట్ లోపల కూర్చొని పైలట్లు ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడని సమాచారం. చివరికి విమానం సేఫ్ గా గమ్యస్థానంలో ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.

ఫ్రాన్స్ పౌర విమానయాన సంస్థ భద్రతా దర్యాప్తు సంస్థ నివేదిక బయటకు రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. జూన్ లో జరిగిన సంఘటన నివేదిక ప్రకారం.. గాల్లోకి విమానం ఎగిరిన కొద్ది సమయానికే కాక్ పిట్ లో పైలెట్, కోపైలెట్ మధ్య వివాదం మొదలైంది. ఒకరు ఎదుటి వ్యక్తి కాలర్ పట్టుకున్నాడు. దీంతో అతడిపై దాడి చేశాడు మరొక పైలట్. కాక్ పిట్ నుంచి అరుపులు క్యాబిన్ లోకి వినిపించినట్లు పలువురు తెలిపారు. దీంతో వారు వెళ్లి గొడవను ఆపారని.. ఓ పైలట్ ఫ్లైట్ డెక్ కు వెళ్లిపోయినట్లు చెప్పారు.