Begin typing your search above and press return to search.

సముద్రంలో సమరం .. చీరాలలో హై టెన్షన్ , అసలు కారణం ఇదే !

By:  Tupaki Desk   |   12 Dec 2020 6:08 PM IST
సముద్రంలో సమరం .. చీరాలలో  హై టెన్షన్ , అసలు కారణం ఇదే !
X
చీరాల మండలం వాడరేవు రణరంగంగా మారింది. గత కొన్ని రోజులుగా మత్స్యకారుల మధ్య సంధి కుదర్చడానికి అధికారులు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కూడా గొడవలే ఎక్కువగా అవుతున్నాయి తప్ప , ఆ సమస్యకి ఓ పరిష్కారం మాత్రం దొరకడంలేదు. తాజాగా నిన్న వాడరేవు మత్స్యకారులపై, కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేశారు . ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్యకారుల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏంటి .. ఎందుకు ఒకరిపై ఒకరు దాడి కి పాల్పడుతున్నారు అంటే ?

గత కొన్ని రోజులుగా వాడరేవు ,కఠారి పాలెం మత్స్య కారుల మధ్య వివాదం నడుస్తోంది. చేపల వేటకు ఉపయోగించే వల విషయంలోనే అక్కడ వివాదం నెలకొంది. వాడరేవు మత్స్యకారులు బల్లవల ఉపయోగిస్తుండగా కఠారి పాలెం జాలర్లు ఐలవల వాడాలని వాదిస్తున్నారు. బల్లవల కారణంగా చేపలతోపాటు గుడ్లు కూడా బయటకొచ్చి మత్స్యసంపద నశించిపోతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ అనుమతి ఉన్నందున తాము అదే వల వాడుతామన్నది వాడరేవు మత్స్యకారుల వాదన. దీనితో ఇరువురి మధ్య గొడవలు వస్తున్నాయి.

ఇక ఈ నెల 2 న ఒంగోలులో ఇరుగ్రామాల మత్స్యకారులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.ఆ సమావేశంలో కూడా మత్స్యకారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సముద్ర తీరంలో ఇరు గ్రామాల మత్స్యకారుల మధ్య అదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం నాడు మరో ప్రయత్నం లో భాగంగా కఠారి వారి పాలెంకి వచ్చారు. అయితే వాడరేవు మత్స్యకారులు అధికారులు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరుకాకుండా వేటకు వెళ్లగా వారిని పట్టుకొస్తామంటూ అధికారులు, పోలీసుల ముందే కఠారి పాలెం వారు సముద్రంలోకి వెళ్లారు. ఆ తర్వాత వారి మధ్య జరిగిన గొడవ లో వాడరేవు గ్రామంపై కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేసి పది మందిని గాయపరిచారు. అయితే, అక్కడ అంత పెద్ద గొడవ జరుగుతున్న అధికారులు మాత్రం అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. ఈ దాడులలో మాజీ సర్పంచ్ రమణ సహా పలువురు మత్స్యకారులకు తీవ్రగాయాలయ్యాయి. మత్స్యకారుల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వాడరేవు , కఠారి వారి పాలెం మత్స్యకారులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగడంతో సముద్రతీర ప్రాంతంలో టెన్షన్ నెలకొంది