Begin typing your search above and press return to search.

భూమా కుటుంబంలో కుర్చీపోరు ... డెయిరీ ఛైర్మన్‌ కుర్చీ పై విఖ్యాత్‌ రెడ్డి !

By:  Tupaki Desk   |   3 Nov 2020 10:10 AM GMT
భూమా కుటుంబంలో కుర్చీపోరు ... డెయిరీ ఛైర్మన్‌ కుర్చీ పై విఖ్యాత్‌ రెడ్డి !
X
భూమా కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. విజయ డెయిరీ చైర్మన్‌ పదవి కోసం మాజీ ఎంపీ, దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి పోటీపడుతున్నాడు. అయితే, చైర్మన్‌ గా ఉన్న భూమా నారాయణరెడ్డి ఇందుకు అంగీకరించడం లేదు. ఈ పదవి గత 25 సంవత్సరాలుగా భూమా కుటుంబం చేతిలోనే ఉంది. ఐదురోజుల క్రితం విజయ డెయిరీ సమావేశం జరగాల్సి ఉండగా కోరం లేక వాయిదా పడింది. ముగ్గురు డైరెక్టర్లను భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, ఆయన బావ భార్గవర్ధన్‌ ఆళ్లగడ్డలో బలవంతంగా ఉంచారు.

దీంతో వారు రాకపోవడంతో కోరం లేక సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి ఈనెల 2వ తేదీ సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమావేశం వాయిదా పడకూడదని, విజయ డెయిరీ చైర్మన్‌ భూమా నారాయణరెడ్డి కొంత మంది డైరెక్టర్లను నంద్యాల శివారులోని రైతునగరంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, భార్గవర్ధన్‌ నాయుడు ఆదివారం రాత్రి డైరెక్టర్లు ఉన్న రైతునగరానికి వెళ్లి భూమా నారాయణ రెడ్డితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నంద్యాల తాలూకా సీఐ దివాకర్‌ రెడ్డి తన సిబ్బందితో రైతు నగరానికి ఆదివారం రాత్రి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

11 మంది డైరెక్టర్లు పాల్గొన్న సమావేశంలో అజెండాలోని అంశాలను ఆమోదించారు. వారం రోజుల క్రితమే 109వ సాధారణ సమావేశం నిర్వహించగా కోరం లేకపోవడంతో దానిని రద్దు చేశారు. అత్యవసర సమావేశంగా పేర్కొంటూ 110వ సమావేశం నిర్వహించారు.ఇన్నాళ్లు మనవడు అనుకున్నామని, ఇలా వ్యవహరిస్తే ఆ పోస్టు కూడా పోతుందని డెయిరీ ఛైర్మన్‌ భూమా నారాయణరెడ్డి పేర్కొన్నారు. భూమా జగత్‌ విఖ్యాత్ ‌రెడ్డి ఛైర్మన్‌ పోస్టు కోసం మీతో గొడవ పడ్డారనే విషయం వాస్తవమేనా, అని విలేకర్లు ప్రస్తావించగా పైవిధంగా స్పందించారు. అందరి అంగీకారంతోనే తాను ఛైర్మన్‌ అయ్యాయనని చెబుతూ కేవలం దుందుడుకుగా వ్యవహరిస్తే కాదన్నారు. భార్గవ్‌ రామ్ మాటలు విని జగత్‌ ఇలా వ్యవహరించారని, తాము పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.