Begin typing your search above and press return to search.

ఘర్షణలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న పండుగలు

By:  Tupaki Desk   |   19 April 2022 4:14 AM GMT
ఘర్షణలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న పండుగలు
X
పండుగల లెక్క మారుతోంది. సాధారణంగా పర్వదినాలు వచ్చిన సందర్భంలో అందరూ ఆనందంగా గడపటం చూస్తుంటాం. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా పుణ్యమా అని గడిచిన రెండేళ్లలో మతపరమైన కార్యక్రమాల్ని బహిరంగంగా నిర్వహించకపోవటం.. ఎవరికి వారు ఇండ్లకే పరిమితమై ఉండటం లాంటి వేళ.. వీలైనంత భారీగా.. ఘనంగా నిర్వహించాలనుకోవటం తప్పేం కాదు. కానీ.. ఆ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం ఈసారి ఎక్కువైంది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి.. హనుమ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలు ఘర్షణలకు కారణంగా మారాయి. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉదంతాల్ని చూస్తే.. అవేమీ సాదాసీదాగా సాగినట్లుగా అనిపించక మానవు. పలువురి మరణాలకు.. పెద్ద ఎత్తున గాయాలకు.. అరెస్టులకు కారణంగా మారాయి. ఇదంతా చూసినప్పుడు పండుగల విషయంలో కాస్తంత ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గుజరాత్.. మహారాష్ట్ర.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. ఢిల్లీలలో పెద్ద ఎత్తున ఘర్షణలకు నవమి.. హనుమ జయంతులు నిలిచాయి. తెలంగాణలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణల్లో రౌడీషీటర్ల పాత్ర ఉండటం చూస్తున్నప్పుడు.. అందరికి కనిపిస్తున్నది కాకుండా మరేదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగక మానదు. వాయువ్య ఢిల్లీలోని జహంగిర్ పురిలో జరిగిన ఘర్షణలే తీసుకుంటే.. మొత్తం 23 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఇరు వర్గాలకు చెందిన వారున్నారు. సోనూ చిక్నా అనే వ్యక్తి అయితే ఏకంగా కాల్పులు జరిపిన పరిస్థితి.

అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే.. అతడు పరారయ్యారు. అతడి కోసం జహంగిర్ పురికి వెళ్లిన పోలీసులపై స్థానికులు.. బంధువులు రాళ్లు విసిరి.. అతన్ని అదుపులోకి తీసుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఇక.. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అచలాపూర్ లో అయితే.. ఖిడ్కీ గేట్.. దుల్హా గేట్ ల మీద మతపరమైన జెండాల్ని ఎగురవేయటం ఉద్రిక్తంగా మారింది. ఈ జెండాల్ని తొలగించే క్రమంలో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించటమే కాదు.. ఏకంగా పట్టణంలో కర్ఫ్యూ విధించే వరకు విషయం వెళ్లింది. మొత్తం 22 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. గుజరాత్ లో అయితే ఒక చిన్న ఘటన చిలికి చిలికి గాలివానలా మారింది.

ఇద్దరు వ్యక్తుల బైకులు ఢీ కొనటం.. అవి రెండు వర్గాలకు చెందిన వారు కావటంతో గొడవలు మొదలయ్యాయి. అవి కాస్తా అల్లర్లుగా మారి చివరకు 19 మందిని అరెస్టు చేయాల్సిన పరిస్థితి. ఒక ఇదే రాష్ట్రంలోని వెరావల్ పట్టణంలో హనుమ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఒక ప్రార్థనా మందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన ఉదంతంలో ఎనిమిదితో పాటు ఆ సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లలో 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణలోనూ కొన్నిచోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పండుగలు ఆహ్లాద వాతావరణంలో జరగాలే తప్పించి.. గొడవలు.. ఉద్రిక్త పరిస్థితుల్లో జరగకూడదు. ఇలాంటి పరిస్థితికి కారణమైన వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. దేశంలో ఇంతకాలం నెలకొన్న మత సామరస్యం దారుణంగా దెబ్బ తినటం ఖాయం. ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.