Begin typing your search above and press return to search.

స‌భ‌లో వేధింపులు..సూసైడ్ చేసుకుంటాన‌న్న ఎంపీ

By:  Tupaki Desk   |   25 Jan 2017 1:13 PM GMT
స‌భ‌లో వేధింపులు..సూసైడ్ చేసుకుంటాన‌న్న ఎంపీ
X
పాకిస్తాన్‌లో మ‌హిళ‌ల హ‌క్కుల‌ను ప్ర‌శ్నార్థ‌కం చేసే మ‌రో ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. సాక్షాత్తూ పార్ల‌మెంట్ వేదిక‌గా మ‌హిళా ఎంపీ వేధింపుల‌కు గుర‌య్యారు. దీంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించారు. మంత్రి ఇమ్‌దాద్ పితాఫీ త‌న‌ను పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని త‌న ప్రైవేట్ చాంబ‌ర్‌ కు రావాల‌ని పిలిచార‌ని నుస్ర‌త్ స‌హ‌ర్ అబ్బాసీ అనే ఎంపీ ఆరోపించారు. ఇది లైంగిక వేధింపేన‌ని ఆమె వాపోయారు. ఇదే విష‌య‌మై పార్లమెంట్‌ లో తాను తీవ్ర నిర‌స‌న తెలిపినా.. మ‌హిళ అయిన డిప్యూటీ స్పీక‌ర్ కూడా ప‌ట్టించుకోలేద‌ని నుస్ర‌త్ ఆరోపించారు. దీంతో ఆమె పార్ల‌మెంట్‌ లోనే ఓ చేతిలో పెట్రోల్ బాటిల్ ప‌ట్టుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించారు. ఈ ఘ‌ట‌న శ‌నివారం జ‌రిగింది.

మ‌హిళా ఎంపీ ఆత్మ‌హ‌త్య బెదిరింపు ఎపిసోడ్ సోష‌ల్ మీడియాలో వేగంగా పాక‌డంతో ఫెడ‌ర‌ల్ పార్టీ నేత‌లు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో దిగివ‌చ్చిన మంత్రి పితాఫీ పార్ల‌మెంట్‌ లోనే నుస్ర‌త్‌ ను క్ష‌మాప‌ణ కోరారు. ఆమెను గౌర‌విస్తున్న‌ట్లుగా ఓ చాద‌ర్‌ ను ఇచ్చారు. వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని నుస్ర‌త్ మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. అయితే పాకిస్థాన్‌ లో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ చ‌ట్టాల అమలు ఎంత దారుణంగా ఉందో దీన్నిబ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చ‌ని ఆమె అన్నారు. ఎంపీల‌కే ర‌క్ష‌ణ లేక‌పోతే సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని నుస్ర‌త్ చెప్పారు. ఈ మ‌ధ్య కాలంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం పాక్ ఎన్నో చ‌ట్టాలు చేసినా.. వాటిని అమ‌లు చేయ‌డంలో మాత్రం ఘోరంగా విఫ‌ల‌మైందని విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/