Begin typing your search above and press return to search.

వైరస్ భయం: పది ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగినా బతకని మహిళ

By:  Tupaki Desk   |   20 Jun 2020 8:30 AM GMT
వైరస్ భయం: పది ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగినా బతకని మహిళ
X
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వైరస్ భయంతో ఒక్క ప్రైవేట్ ఆస్పత్రి అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను చేర్చుకోలేకపోయారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు పది ప్రైవేటు ఆస్పత్రులు తిరిగారు. అయినా ఎవరూ ఆమెను చేర్చుకోకపోవడంతో చివరకు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ లోని అత్తాపూర్‌కు చెందినశ్రీకాంత్, రోహిత(41) భార్యాభర్తలు. వీరికి పిల్లలు సాయితిలక్‌, సిరివెన్నెల. శ్రీకాంత్ బీఎస్ఎన్ఎల్ లో పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా రోహిత జ్వరం, జలుబు, ఆయాసంతో బాధపడుతోంది. బుధవారం (జూన్ 17) రాత్రి మొదట స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి భార్యను తీసుకెళ్లాడు. అయితే అక్కడున్న సిబ్బంది ఆమెను చేర్చుకోవడం కుదరదని చెప్పారు. ఆమెకు వైరస్ సోకిందేమోననే భయంతో చేర్చుకోలేదు. మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగాఅక్కడా అదే సమాధానం. అందరూ వైరస్ సోకిందేమోననే భయంతో ఆమెను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. అలా రోహితను భర్త శ్రీకాంత్ మొత్తం 10 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిప్పాడు. చివరికి ఆమెను తీసుకుని గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ చేర్పించిన కొద్ది నిమిషాలకే గురువారం ఉదయం (జూన్ 18) రోహిత చనిపోయింది. దీంతో శ్రీకాంత్ కన్నీరుమున్నీరుయ్యాడు. బోరున విలపించాడు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని శ్రీకాంత్ ఆరోపించాడు.

ఈ సందర్భంగా రోహిత మృతిపై మానవ హక్కుల సంఘంలో భర్త పిటిషన్ వేశాడు. వైరస్ ఉందో లేదో తెలుసుకోకుండానే అవనసర భయాలు, అనుమానాలతో తన భార్యను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 10 ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్క వైద్యుడు కూడా ఆమెను పరీక్షించకుండా వదిలేశాడని ఆరోపించారు. ఆమె జ్వరం.. శ్వాసకోశ సంబంధ సమస్యలతో ప్రాణాలు విడిచిందని తేలింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని భర్త శ్రీకాంత్‌ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి మద్దతుగా పలువురు నిలబడుతున్నారు.