Begin typing your search above and press return to search.

కూచిబొట్ల హ‌త్య‌పై రంగంలోకి ఎఫ్‌బీఐ

By:  Tupaki Desk   |   1 March 2017 11:53 AM GMT
కూచిబొట్ల హ‌త్య‌పై రంగంలోకి ఎఫ్‌బీఐ
X
అమెరికా అత్యున్న‌త ద‌ర్యాప్తు విభాగ‌మైన ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌(ఎఫ్‌బీఐ) కూచిభొట్ల శ్రీనివాస్ హ‌త్య కేసును విచారించేందుకు రంగంలోకి దిగింది. శ్రీ‌నివాస్ హ‌త్య జాత్యంహ‌ర దాడి అవునా కాదా అన్న కోణంలో ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్న‌ట్లు ఎఫ్‌బీఐ వెల్ల‌డించింది. అమెరికాలోని కేన్స‌స్ సిటీలో గ‌ల‌ ఆస్టిన్ బార్‌లో జ‌రిగిన కాల్పుల్లో శ్రీ‌నివాస్ మృతిచెంద‌గా, అలోక్‌, గ్రిల్ల‌ట్‌లు గాయ‌ప‌డ్డారు. అయితే కాల్పులు జ‌రిపిన ప్యూరింట‌న్ అనే శ్వేత‌జాతీయుడు తెలుగు యువ‌కుల్ని ఇరానియ‌న్లుగా భావించిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా అటార్నీ ఆఫీసు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ రైట్స్‌తో క‌లిసి ఎఫ్‌బీఐ శ్రీ‌నివాస్ హ‌త్య‌ను విచారిస్తోంది. ఆ హ‌త్య జాతివివ‌క్ష దాడి కిందకు వ‌స్తుందా లేదా అన్న కోణంలో ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు. ఈ హ‌త్య కేసులో ఒలేత్ పోలీసు విభాగంతో ప‌నిచేసేందుకు ఎఫ్‌బీఐ సుముఖంగా ఉంద‌ని తెలిసింది.

కేన్స‌స్ స‌మీపంలోని గర్మిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీ‌నివాస్‌, అలోక్‌లు కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన రోజున బార్‌లో సేద‌తీరుతున్నారు. అయితే అక్క‌డ ఉన్న 51 ఏళ్ల ప్యూరింట‌న్ ఇద్ద‌రు తెలుగు యువ‌కుల‌పై అవ‌మాన‌క‌ర రీతిలో మాట్లాడారు. ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వెళ్లాలంటూ గ‌ట్టిగా అరిచాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తిరిగివ‌చ్చిన ప్యూరింట‌న్ గ‌న్ తీసి కాల్పులు జ‌రిపాడు. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ బిగ్గ‌ర‌గా అరుస్తూ కాల్పులు జ‌రిపిన‌ట్లు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు తెలిపారు. దీంతో ఎప్‌బీఐ జాత్యంహ‌ర కోణంలో శ్రీ‌నివాస్ హ‌త్య‌ను విచారిస్తున్న‌ది. సుమారు రాత్రి 7.30 నిమిషాల‌కు కాల్పులు జ‌రిపిన ప్యూరింట‌న్ ఆ త‌ర్వాత క్లింట‌న్ ప‌ట్ట‌ణానికి వెళ్లి అక్క‌డ త‌ల‌దాచుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అక్క‌డ ఓ బార్‌టెండ‌ర్‌కు తాను దాక్కునేందుకు చోటు కావాల‌ని ప్యూరింటన్ వేడుకున్నాడు. ఇద్ద‌రు ఇరానియ‌న్ల‌ను చంపాన‌ని, త‌న‌కు ర‌క్ష‌ణ కావాలంటూ బార్‌టెండ‌ర్‌కు చెప్పాడు. దీంతో ఆ బార్‌టెండ‌ర్ ప్యూరింట‌న్ గురించి పోలీసుల‌కు ఫోన్ చేసి చెప్పాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.