Begin typing your search above and press return to search.

లాస్‌ వెగాస్‌ కాల్పులు జ‌రిపింది ఐసిస్ కాదేమో!

By:  Tupaki Desk   |   3 Oct 2017 6:43 AM GMT
లాస్‌ వెగాస్‌ కాల్పులు జ‌రిపింది ఐసిస్ కాదేమో!
X
వినోదానికి - షాపింగ్‌ కు - జూదానికి అంతర్జాతీయ రాజధానిగా పేరొందిన అమెరికాలోని లాస్ వెగాస్ నగరం ఆదివారం రాత్రి తుపాకుల మోతతో హోరెత్తింది. ప్రతి ఏడాది నిర్వహించే సంగీత ఉత్సవంలో జానపద గీతాలను ఆస్వాదిస్తున్న అభిమానులపై ఓ దుండగుడు తుపాకులతో విరుచుకుపడి 58మందిని పొట్టనపెట్టుకున్నాడు. అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైనదిగా పేర్కొంటున్న ఈ కాల్పుల ఘటన ఆదివారం రాత్రి నెవడా రాష్ట్రంలోని లాస్‌ వెగాస్‌ లో చోటుచేసుకుంది. ఐదు నిమిషాల వ్యవధిలో దుండగుడు కొన్ని వందల రౌండ్లు జరిపిన కాల్పుల్లో 500 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌కు తామే బాధ్యుల‌మ‌ని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ చెప్తుండ‌గా....ఎఫ్‌ బీఐ మాత్రం ఐసిస్ ప‌ని అయి ఉండ‌క‌పోవ‌చ్చున‌ని అంటోంది.

కాల్పులు జరిపిన దుండగుడిని 64 ఏళ్ల‌ స్టీఫెన్ ప్యాడాక్‌ గా గుర్తించారు. సంగీత ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న మ్యాండలే బే హోటల్‌ పై నుంచి దుండగుడు కాల్పులు జరిపినట్టు లాస్ వెగాస్ పోలీస్ అధికారి జోసఫ్ లొంబార్డో చెప్పారు. దుండగుడు హోటల్ 32వ అంతస్తుపై నుంచి కింద మైదానంలో ఉన్న ప్రేక్షకులపైకి కాల్పులు జరిపాడని తెలిపారు. మృతుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. భద్రతా సిబ్బంది అతడిని చేరుకొనేలోపే హోటల్ గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

లాస్ వెగాస్‌ లో సంగీత కచేరీపై కాల్పులు జరిపి 50మంది మృతికి కారణమైన స్టీఫెన్ ప్యాడాక్ తమ సైనికుడేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అతడు కొద్ది నెలల క్రితమే ఇస్లాం మతంలోకి మారాడని తెలిపింది. మధ్యప్రాచ్యంలోని ఐఎస్‌ పై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరుపుతున్న దాడులకు ప్రతీకారంగానే స్టీఫెన్ కాల్పులు జరిపాడని ఐఎస్‌ కు చెందిన అమాక్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఎఫ్‌ బీఐ ఈ విష‌యంలో సందేహాలు వ్య‌క్తం చేస్తోంది. లాస్‌ వెగాస్‌ మృత్యుకాండ వెనుక అంతర్జాతీయ తీవ్రవాదుల కుట్రగా పేర్కొనేందుకు తగిన ఆధారాలు లేవని ఫెడరల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ ప్రాథమిక దర్యాప్తులొ అభిప్రాయపడింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఇస్లామిక్‌ మతంలో చేరిన తమ సైనికుడే ఈ దాడికి పాల్పడ్డాడని, ఇది తాము చేపట్టిన ఆపరేషనేనని తొలుత ఐసిస్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో ఎఫ్‌ బీఐ ప్రాథమిక దర్యాప్తు వివరాలను వెల్లడించింది. ``ఇప్పటి దాకా లభించిన ఆధారాలు - వివరాలను బట్టిచూస్తే ఉగ్రవాదులకు సంబంధం లేదని అనిపిస్తోంది` అని ఆరోన్‌ రౌస్‌ తెలిపారు.

మ‌రోవైపు గత ఏడాది జూన్‌ లో ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌ క్లబ్‌ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 49 మంది మరణించారు. అంతకుముందు 2012 డిసెంబర్‌ లో కనెక్టికట్ రాష్ట్రంలోని న్యూటౌన్ శాండీ ఎలిమెటరీ స్కూల్‌ లో ఓ దుండగుడు 26 మంది విద్యార్థులను కాల్చిచంపాడు. 2007 ఏప్రిల్‌ లో ఓ సాయుధుడు వర్జీనియా టెక్ యూనివర్సిటీలో 32 మందిని కాల్చి చంపాడు. తాజాగా లాస్‌ వెగాస్ ఘటన అమెరికాలో జరిగిన నాలుగో అతిపెద్ద దారుణంగా పోలీసులు పేర్కొన్నారు.