Begin typing your search above and press return to search.

ఈవీఎంల్లో త‌ప్పులకు ఫ్రూఫ్ దొరికింది

By:  Tupaki Desk   |   24 July 2017 6:03 AM GMT
ఈవీఎంల్లో త‌ప్పులకు ఫ్రూఫ్ దొరికింది
X
ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఓట‌మిపాలైన రాజ‌కీయ పార్టీలు ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయ‌ని.. వాటిల్లో ఒక‌దానికి ఓటేస్తే మ‌రొక గుర్తుకు ఓటు ప‌డింద‌ని.. ఇదే త‌మ ఓట‌మికి కార‌ణ‌మంటూ ఆరోపించ‌టం తెలిసిందే. ఇంత‌కాలం ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌న్నీ కూడా రాజ‌కీయ‌మైన‌వ‌న్న భావ‌న ప‌లువురిలో ఉంది. అయితే.. పార్టీలు ఆరోపిష్తున్నట్లుగా సాంకేతిక లోపాలు ఈవీఎంల‌లో ఉండి ఉడొచ్చ‌న్న సందేహం క‌లిగేలా తాజా ప‌రిణామం చోటు చేసుకుంది.

ఈవీఎం కార‌ణంగా త‌ప్పు దొర్లిన వైనాన్నికేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే స్వ‌యంగా ఒప్పుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈవీఎంల మీద నేత‌లు వ్య‌క్తం చేసే సందేహాలు నిజ‌మేనా? అన్న భావ‌న క‌లుగ‌జేయ‌టం ఖాయం. ఈవీఎంల‌లో దొర్లిన త‌ప్పును ఈసీ ఒప్పుకున్న వైనం ఎక్క‌డ జ‌రిగింది? ఎలా జ‌రిగింద‌న్న విష‌యంలోకి వెళితే..

మ‌హారాష్ట్రలో జ‌రిగిన‌జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బుల్డాణా జిల్లాలోని సుల్తాన్ పూర్ లోని పోలింగ్ కేంద్రంలో ఎన్నిక‌ల్ని నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా 57/6 పోలింగ్‌ కేంద్రంలో ఒక ఓట‌రు ఓటు వేశారు. స‌ద‌రు ఓట‌రు కొబ్బ‌రిబొండాం గుర్తుకు ఓటు వేస్తూ బ‌ట‌న్ నొక్కారు. బొండాం ఎదురుగా లైటు వెల‌గాల్సింది పోయి.. క‌మ‌లం గుర్తు ఎదుట లైటు వెలిగింది. దీనిపై ఎన్నిక‌ల అధికారుల‌కు స‌ద‌రు ఓట‌రు ఫిర్యాదు చేశారు. ఇదే త‌ర‌హాలో మ‌రో పిర్యాదు అదే రోజు మ‌ధ్యాహ్నాం మ‌రో ఓట‌రు కూడా లేవ‌నెత్తారు. దీంతో.. ఈ ఉదంతంపై విచార‌ణ జ‌రిపిన అధికారులు పోలింగ్‌ ను ర‌ద్దు చేసి మ‌ళ్లీ నిర్వ‌హించారు. అప్పుడు మాత్రం ఈవీఎంలు స‌రిగానే ప‌ని చేసిన‌ట్లుగా అధికారులు పేర్కొన్న‌ట్లుగా ఈసీ పేర్కొంది. ఏమైనా.. ఈవీఎంల సాంకేతిక‌పై శాస్త్రీయంగా ప‌రిశోధ‌న జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది.