Begin typing your search above and press return to search.

నిషిత్ బెంజ్ కారులో త‌ప్పుందా?

By:  Tupaki Desk   |   20 May 2017 5:08 AM GMT
నిషిత్ బెంజ్ కారులో త‌ప్పుందా?
X
ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టం తెలిసిందే. అత‌డి మ‌ర‌ణానికి కార‌ణం అతి వేగమేన‌ని ప్రాథ‌మికంగా తేల్చారు. గంట‌కు 200కి.మీ. వేగంతో కారును న‌డిపిన నేప‌థ్యంలో జ‌రిగిన ప్ర‌మాదంతోనే నిషిత్ ప్రాణాలు పోయేలా చేసింద‌న్న‌ మాట ప‌లువురి నోట వినిపించింది. ఇందుకు భిన్న‌మైన వాద‌న తొలిసారి తెర‌పైకి వ‌చ్చింది. కారు ప్ర‌మాదానికి వేగం ఒక కార‌ణ‌మైతే.. కారులోని లోపాలు కూడా కార‌ణ‌మేన‌న్న మాట‌ ఇప్పుడిప్పుడే మొద‌లు కావ‌టం గ‌మ‌నార్హం. యాంత్రిక లోపాలే నిషిత్ ప్రాణాల్ని బ‌లి తీసుకున్నాయ‌న్న వాద‌న‌ను తెర‌పైకి వ‌చ్చింది.

ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత‌.. ఈ ఉదంతంపై విచారిస్తోన్న హైద‌రాబాద్ పోలీసులు బెంజ్ కంపెనీకి కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌మాదానికి గురైన కారును ప‌రిశీలించేందుకు జ‌ర్మ‌నీ.. సింగ‌పూర్.. హాంకాంగ్.. చెన్నై.. ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల‌కు సంబంధించిన బెంజ్ సాంకేతిక నిపుణుల బృందం హైద‌రాబాద్‌ కు చేరుకొని ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని.. కారును నిశితంగా ప‌రిశీలించారు.

అతివేగ‌మే నిషిత్ ప్రాణాలు తీసింద‌న్న‌ది నిజ‌మే అయినా.. అదే కార‌ణం కాద‌ని.. అత్యంత భ‌ద్ర‌త ఉన్న కారులోని లోపాలు కూడా కార‌ణంగా చెబుతున్నారు. ఇలాంటి వాద‌న‌కు త‌ర్కం ఏమిట‌న్న అంశంపై నిపుణులు కొంద‌రు ఎత్తి చూపుతున్న అంశాలు విన్న‌ప్పుడు ఆలోచ‌న‌ల్లో ప‌డేలా ఉంది.

నిపుణులు లేవ‌నెత్తుతున్న సందేహాల్ని చూస్తే..

= ప్ర‌మాద స‌మ‌యంలో అన్ని బ్యాగులు ఓపెన్ కాక‌పోవ‌టం ఏమిటి?

= ఎంత వేగ‌మైతే మాత్రం ఇంజిన్ సైతం ముందు సీటులోకి నెట్టుకొని రావ‌టం ఏమిటి?

= బెంజ్ కంపెనీకి చెందిన ఏఎంజీ 63కి చెందిన కారు ప‌లు క్రాష్ టెస్టుల్లో ధృడ‌మైన వాహ‌నంగా పేరుంది. అయితే.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగిన ప్ర‌మాదాల్లో ఈ వాహ‌నాలు నుజ్జునుజ్జు అయిన దాఖ‌లాలే ఎక్కువ‌గా ఉండ‌టం ఏమిటి?

= కంపెనీకి ఉన్న ఇమేజ్‌.. భ‌ద్ర‌తా ప‌ర‌మైన లోపాలు బ‌య‌ట‌కు రాకుండా చేస్తున్నాయా?

= దాదాపు రూ.2.10 కోట్ల‌కు పైనే ఉండే ఈ వాహ‌నంలో కోటి రూపాయిల మేర భ‌ద్ర‌తా ప‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ల కోస‌మే ఖ‌ర్చు పెట్టిన‌ట్లుగా కంపెనీ చెబుతున్న‌ప్పుడు.. తాజా ఉదంతంలో అవ‌న్నీ ఏమైన‌ట్లు?

= నిషిత్ న‌డిపిన కారు బ‌రువు 2.5 ట‌న్నులు. అయితే.. ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ప్పుడు ఇంజిన్ సైతం తునాతున‌క‌లై క్యాబిన్‌ లోకి చొచ్చుకు రావ‌టం ఏమిటి?

= ప్ర‌మాదం జ‌రిగిన వేళ‌.. టెలిస్కోపీ స్టీరింగ్ రాడ్ సైతం ప‌ని చేయ‌క‌పోవ‌టంతో నితిష్ ఛాతీకి బ‌లంగా త‌గిలి.. అత‌డి స్టెర్న‌మ్ బోన్ విరిగింది. ఊపిరితిత్తుల‌కు పంచర్ జ‌రిగి మ‌ర‌ణించిన‌ట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పిన వైనం చూసిన‌ప్పుడు కీల‌క‌మైన వేళ‌లో టెలిస్కోపీ స్టీరింగ్ రాడ్ ప‌ని చేయ‌క‌పోవ‌టం ఏమిటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/