Begin typing your search above and press return to search.

నాలుగేళ్ల కుమార్తెపై ఓ తండ్రి క్షుద్ర పూజలు.. ఆత్మకూరులో అరాచకం!

By:  Tupaki Desk   |   16 Jun 2022 5:32 AM GMT
నాలుగేళ్ల కుమార్తెపై ఓ తండ్రి క్షుద్ర పూజలు.. ఆత్మకూరులో అరాచకం!
X
ప్రపంచం సాంకేతికంగా ఎంతగా ముందుకు వెళ్తున్నా.. గ్రహాలపైకి రాకెట్లు పంపి విశ్వ రహస్యాలను చేధిస్తున్నా కొంతమందిలో మాత్రం మూఢ విశ్వాసాలు వదలడం లేదు. చివరకు బాగా చదువుకున్నవారు కూడా వీటి బారిన పడటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ తండ్రి నాలుగేళ్ల కుమార్తె క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరులో కలకలం సృష్టించింది.

ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ఓ తండ్రి ఉన్మాదంతో సొంత కూతురినే చంపబోయాడు.

ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఎస్‌ఐలు.. శివశంకరరావు, సాయిప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. పేరారెడ్డిపల్లికి చెందిన వేణు, యామిని దంపతులకు 4 ఏళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా కొంత స్థితిమంతుడైన వేణు.. జేసీబీ, ట్రాక్టర్లను అద్దెకు తిప్పుతూ ఉంటాడు.

ఈ క్రమంలో మరింత స్థితమంతుడు కావడానికి వేణు గత కొద్ది రోజులుగా క్షుద్ర పూజలవైపు ఆకర్షితుడయ్యాడు. నిత్యం ఇంట్లో ముభావంగా ఉంటూ తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో 5 రోజుల కిందట వేణు భార్య యామిని తన ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని కుప్పురుపాడులోని పుట్టింటికి వెళ్లింది.

జూన్ 14న వేణు అత్తగారింటికి వెళ్లి తన ఇద్దరు పిల్లలను తీసుకొని పేరారెడ్డిపల్లికి తిరిగొచ్చాడు. భార్యను 2 రోజులు ఆగి రమ్మని చెప్పాడు. జూన్ 15న ఇంట్లోని దేవుడి గది వద్ద కూతురు పూర్విక (4)ను కూర్చోబెట్టి పాపపై, తనపై పసుపు నీళ్లు చల్లాలని తన తల్లిని కోరాడు. దీంతో ఆమె పూజ చేసుకుంటున్నాడు కదా అని పసుపు నీళ్లు చల్లి వెళ్లిపోయింది.

కొద్దిసేపటికి కుమార్తె పూర్విక నోట్లో పెద్ద ఎత్తున కుంకుమ పోస్తుండటంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి పెద్దగా ఏడ్చింది. దీంతో ఉన్మాదంలో ఉన్న వేణు పాప అరవకుండా గొంతు నులిమాడు. ఈ పరిస్థితిని పసికట్టిన పాప మేనమామ, చుట్టుపక్కల వారు కేకలు పెడుతూ వెళ్లి పాపను కాపాడి హుటాహుటిన ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు, అనంతరం చెన్నైకి తరలించినట్లు పోలీసులు వివరించారు. పాప పరిస్థితి ఇంకా విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి తండ్రి వేణును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.