Begin typing your search above and press return to search.

కేసీఆర్ కంట్లో నలకలుగా.. ‘‘ఆత్మహత్యలు’’

By:  Tupaki Desk   |   21 Sept 2015 11:48 AM IST
కేసీఆర్ కంట్లో నలకలుగా.. ‘‘ఆత్మహత్యలు’’
X
తన తెలివితేటలతో.. మేథోతనంతో తెలంగాణ రాష్ట్రంలో విపక్ష ఉనికిని ప్రశ్నార్థకం చేయగలిగారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తన రాజకీయ చతురతతో ప్రతిపక్ష నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేసే ఆయన.. వారి వాణికి పెద్ద విలువ లేదన్నట్లుగా చేయటంలో విజయవంతం అయ్యారు. తెలంగాణలో విపక్షాల పరిస్థితి విచిత్రంగా ఉంది.

పలు అంశాలను తెరపైకి తీసుకొచ్చి.. అధికారపక్షానికి వణుకు పుట్టించేలా చేయాల్సిన తెలంగాణ విపక్షాలు ఇప్పుడు ఉనికి కోసం పోరాడే పరిస్థితి. విపక్షాల మీద సునాయాసంగా విజయం సాధించిన కేసీఆర్.. ఇష్యూల మీద మాత్రం తన పట్టును పెంచలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఇప్పుడు కంట్లో నలకలుగా మారి.. ఒకచోట కుదురుగా కూర్చోనీయకుండా చేస్తున్నాయి. ఓ వైపు రైతుల ఆత్మహత్యలు.. మరోవైపు కల్తీకల్లు మరణాలు.

దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా రుణమాఫీ పథకాన్ని సమర్థంగా విడుదల చేసినట్లుగా తెలంగాణ సర్కారు తరచూ చెప్పుకోవటం తెలిసిందే. విడతల వారీగా రుణమాఫీకి సంబంధించిన వేలాది కోట్ల రూపాయిలు విడుదల చేసినట్లు చెబుతున్నా.. గణాంకాలు కనిపిస్తున్నా.. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ప్రశ్నేమిటంటే.. తెలంగాణ సర్కారు కనుక సమర్థంగా రుణమాఫీని అమలు చేసిన పక్షంలో ఇంతమంది రైతులు ఇంతభారీ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు.

గడిచిన రోజుల్లో ఒక్క ఆదివారం నాడే తెలంగాణ వ్యాప్తంగా పదిమంది రైతులు మరణించారు. వీరిలో ఎనిమది మంది ఆత్మహత్యలు చేసుకోగా.. మరో ఇద్దరు మాత్రం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. మరోవైపు కేసీఆర్ సర్కారు కల్తీ కల్లు మీద దృష్టి సారించింది. కల్తీ లేని కల్లును అమ్మేలా చేసే విషయంలో కరుకుగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారుకారణంగా కల్తీ కల్లు మార్కెట్ లో కనిపించని పరిస్థితి. దీన్లో వాడే అత్యంత ప్రమాదకరమైన రసాయనం కారణంగా.. ఉన్నట్లుండి వీరికి కల్తీ కల్లు తాగని కారణంగా పిచ్చి పట్టినట్ల ప్రవర్తిస్తున్నారు. చికిత్స చేస్తున్నా వారి ప్రాణాలు మాట నిలవని పరిస్థితి. ఈ కారణంతో ఆదివారం ఒక్కరోజులోనే పది మంది కల్తీకల్లు తాగక మరణించారు. విపక్షాలు లేకున్నా.. ఓవైపు రైతు ఆత్మహత్యలు.. మరోవైపు కల్తీ కల్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని చెమటలు పుట్టిస్తున్నాయనటంలో సందేహం లేనట్లే.