Begin typing your search above and press return to search.

ఏపీలోనూ రైతు ఉద్య‌మం.. సంకేతాలు ఇవే!

By:  Tupaki Desk   |   10 Dec 2021 8:00 AM IST
ఏపీలోనూ రైతు ఉద్య‌మం.. సంకేతాలు ఇవే!
X
ఏపీ లోనూ రైతులు రోడ్డెక్క‌నున్నారా? రాష్ట్రం లోని వైసీపీ స‌ర్కారు పై క‌దం తొక్క‌నున్నారా? వ‌రి ధాన్యం సేక‌ర‌ణ‌, గిట్టుబాట ధ‌ర‌ల విష‌యంలో .. ఇప్ప‌టికే ఇబ్బందులకు గుర‌వుతున్న ఏపీ అన్న‌దాత‌.. ఇక‌, త‌న పౌరుషం చూపించ‌నున్నాడా? అంటే.. ఔన‌నే అంటున్నారు రైతు సంఘాల నాయ‌కులు. మేధావులు. నిజానికి ఇప్ప‌టికే.. ఏపీ దాయాది రాష్ట్రం తెలంగాణ‌లో రైతులు.. ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నారు. యాసంగిలో వ‌రి వేయాలో వ‌ద్దో తేల్చుకోలేక పోతున్నారు. ఇప్ప‌టికే ఉన్న ధాన్యాన్ని కొనేదిక్కులేక స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంది.

ఇక‌, ఇప్పుడు ఇదే స‌మ‌స్య ఏపీలోనూ పాకే అవ‌కాశం ఉంద‌ని.. మేధావులు చెబుతున్నారు. ఎందుకంటే.. గ‌త కొన్నాళ్లుగా ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం రైతుల‌ను వ‌రి సాగు చేయొద్ద‌ని చెబుతోంది. ప్ర‌స్తుతానికి బోర్ల కింద ఉన్న అన్న‌దాత‌లు.. వేయొద్ద‌ని చెబుతున్నా.. మొత్తానికి వ‌రి సాగు వ‌ద్ద‌నే సంకేతాల‌ను మాత్రం బ‌లంగానే పంపుతున్నారు. నేరుగా మంత్రి క‌న్న‌బాబు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా రైతుల‌కు బోర్ల కింద సాగ‌య్యే పంట‌ల్లో వ‌రి వ‌ద్ద‌ని.. ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేసుకోవాల‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. అంటే.. అటు తెలంగాణ‌లో ఉన్న ప‌రిస్థితే ఏపీలోనూ ఉంద‌ని తెలుస్తోంది.

అయితే.. ఇక్క‌డ ప్ర‌భుత్వం నేరుగా వ‌రి పై యుద్ధం చేయ‌ కుండా.. కొంత మాట‌ల‌కు మ‌సిపూసి.. నెమ్మ‌దిగా చెబుతోంద‌నే భావ‌న వ్య‌క్త‌ మ‌వుతోంది. ఇక‌, ఇప్ప‌టికే పండించిన ధాన్యాన్ని ఆర్బీకేల్లో ఎవ‌రూ కొనుగోలు చేయ‌డం లేద‌ని.. రైతులు వాపోతున్నారు. ఇదే విష‌యాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొంద‌రు.. ఇటీవ‌ల అసెంబ్లీ లో ప్ర‌స్తావించారు. కేవ‌లం ఆర్బీకేలు నామ్ కేవాస్తేగా మారి పోయాయ‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతులు ఎన్నో ఆశ‌ల‌తో ఆర్బీకే ల‌కు ధాన్యాన్ని తీసుకువ‌స్తున్నా.. వాటిని కొనుగోలు చేసే అధికారులు. వివిధ రూపాల్లో వంక‌లు పెడుతున్నార‌ని.. ఇది రైతుల‌కు ఇబ్బందిగా మారింద‌ని అధికార పార్టీ ఎమ్మెల్యేలే చెప్ప‌డం గ‌మనార్హం.

మ‌రో వైపు.. కౌలు రైతులు.. త‌మ‌కు కూడా రైతు భ‌రోసా వ‌ర్తింప చేయాల‌ని.. డిమాండ్లు చేస్తున్నారు. ఆర్బీకేల వ‌ద్ద‌.. వీరు ఆందోళ‌న‌లుకూడా చేస్తున్నారు. ఒక‌వైపు ధాన్యం గిట్టుబాటు ధ‌ర‌లు లేక పోవ‌డం.. మ‌రో వైపు.. ప్ర‌భుత్వం బోర్ల కింద వ‌రి వ‌ద్ద‌ని చెప్ప‌డం.. ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు తీవ్ర‌స్థాయిలో జాప్యం జ‌రిగి రైతులు న‌ష్ట‌పోవ‌డం వంటి ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఏపీలోనూ..అన్న‌దాత‌లు.. రోడ్డెక్క‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదే విష‌యాన్ని రైతు సంఘాల నాయ‌కులు.. రైతు వ‌ర్గాల మేధావులు కూడా హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో.. చూడాలి.