Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టుకు షాకిచ్చిన రైతులు

By:  Tupaki Desk   |   12 Jan 2021 12:25 PM IST
సుప్రీంకోర్టుకు షాకిచ్చిన రైతులు
X
సుప్రీంకోర్టు రైతులు షాకిచ్చారు. రైతుల సమస్యలు తీర్చడం కోసం ముందుకొచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఆఫర్ ను తిరస్కరించారు.తమకు కమిటీలు వద్దని.. కొత్త వ్యవసాయచట్టాల రద్దుయే కావాలంటూ సుప్రీంకోర్టు ప్రతిపాదనను అంగీకరించడం లేదు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల బాధ చూడలేక సుప్రీంకోర్టు తాజాగా కేంద్రానికి వార్నింగ్ ఇచ్చింది. వారి సమస్యలు తీరుస్తారా? మమ్మల్ని తీర్చమంటారా? అని నిలదీసింది. ఈ క్రమంలోనే రైతుల సమస్యలు తీర్చేందుకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు ద్వారా కేంద్రంతో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనను తాజాగా రైతు సంఘాలు తోసిపుచ్చాయి.

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ అని.. అందులో కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేనప్పుడు సుప్రీంకోర్టు కమిటీలతో ఏం ప్రయోజనం అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం మినహా మరో డిమాండ్ తమ వద్ద లేదని.. కేంద్రంకూడా ఈ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీలతో కాలయాపన మినహా పరిష్కారం దొరకదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రతిపాదనను తిరస్కరించాయి.

అయితే సుప్రీంకోర్టు చొరవను మాత్రం రైతు సంఘాలు స్వాగతించాయి.త మ వాదనను వినిపిస్తామని చెబుతున్నాయి. వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో రైతుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.