Begin typing your search above and press return to search.

ఏపీలో ఒకేసారి రెండు ఘ‌ట‌న‌లు..రైతుల కేంద్రంగా సాగిన చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు!

By:  Tupaki Desk   |   28 Nov 2022 1:30 PM GMT
ఏపీలో ఒకేసారి రెండు ఘ‌ట‌న‌లు..రైతుల కేంద్రంగా సాగిన చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు!
X
ఏపీలో ఒకే రోజు రెండు చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. దీనిలో ప్ర‌తిప‌క్షాల పాత్ర ఏమాత్రం లేదు. అంతా అధికార పక్షం.. రైతుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌నలే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం రైతుల‌కు అండ‌గా ఉన్నామ‌ని పేర్కొంటూ.. వారి ఖాతాల్లో సీఎం జ‌గ‌న్ డ‌బ్బులు వేశారు. అయితే, అదేస‌మ‌యంలో కృష్ణాజిల్లా స‌హా ప‌లు జిల్లాల్లో రైతులు.. త‌మ ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేద‌ని.. పండించిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిర‌స‌న తెలిపారు. ఈ రెండు ఘ‌ట‌న‌లు ఒకేరోజు ఒకే స‌మ‌యంలో చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

సీఎం ఏం చేశారు?వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలను సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.

62 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారని సీఎం జగన్ తెలిపారు. మూడేళ్ల 5 నెలల కాలంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామన్నారు. ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే.. అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నామని తెలిపారు. మొత్తం రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్న సీఎం.. 21.31 లక్షలమందికి రూ.1,834 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామన్నారు.

8,22,411 మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. ఏడాదిలోపు చెల్లించిన రైతులకు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా ద్వారా మూడేళ్లలో రూ.25,971 కోట్లు.. బీమా సొమ్ము రూపంలో రూ.6,685 కోట్లు రైతులకు చెల్లించామని పేర్కొన్నారు.

రైతుల నిర‌స‌న ఇదీ..ధాన్యం కొనుగోలు చేయాలంటూ కృష్ణా జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పామర్రు-గుడివాడ రోడ్డులో జమిగోల్వేపల్లి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధాన్యం పోసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.

అప్పులతో వ్యవసాయం చేస్తున్నామని.. వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కోత చేసి పదిరోజులైనా పంట కొనేవాళ్లు లేరని మండిపడ్డారు. దిగుబడికి సరిపడా సంచులను సొసైటీలో ఇవ్వడం లేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సిన వ్యవసాయ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.